Gun License : హమాస్ దాడుల నేపథ్యంలో ఆయుధాల కోసం ఇజ్రాయెలీలు ఎగబడుతున్నారు. తుపాకీ లైసెన్సుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారి సంఖ్య ఇప్పటికే 7,946కి చేరింది. వ్యక్తిగతంగా హ్యాండ్‌గన్ కోసం 545 మంది దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించింది. 970 కొత్త లైసెన్సులకు ఆమోదముద్ర వేసింది.
లైసెన్స్‌ల కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో జాతీయ భద్రతా మంత్రిత్వ శాఖ అదనంగా 60 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. ఈ ఏడాది ఆరంభం నాటికే మొత్తం మీద 27 వేల తుపాకీ పర్మిట్లను అనుమతించారు. ఇక నేషనల్ సెక్యూరిటీ మినిస్ట్రీ 10వేల ఆయుధాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 4 వేల అసాల్ట్ రైఫిల్స్‌ను రూ.191.54 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కూడా కుదిరాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో గన్ పర్మిట్లను సులువుగా పొందలిగేలా నిబంధనలను సడలించారు. తుపాకీ కొనుగోలుపై ఆసక్తి చూపే ఇజ్రాయెల్ పౌరుడెవరైనా సరే.. దరఖాస్తు చేసుకున్న వారం రోజులకే అందించేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గాజా ఉద్రిక్తతలు మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉన్నందున.. పౌరులు గన్ లైసెన్స్ కోసం ముందుకొస్తున్నారు.
ఇక తుపాకీ పేల్చడంలో శిక్షణ కోసం కూడా పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్లాస్‌ల కోసం 4.5 గంటల సమయం చాలు. ప్రాక్టికల్ ట్రైనింగ్ లో వంద వరకు తూటాలకు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తారు. రూ.63 వేలు వెచ్చిస్తే బేసిక్ మోడల్ లభిస్తుంది.