Israel-Hamas war updates : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆరంభమై నాలుగు వారాలు. హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించే లక్ష్యంతో ఇజ్రాయెల్ బలగాలు ముందుకు వెళ్తున్నాయి. హమాస్ మిలిటెంట్ల కేంద్రమైన గాజా సిటీని పూర్తిగా చుట్టుముట్టినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. ఇప్పటివరకు గాజాలో 11 వేల వరకు హమాస్ టార్గెట్లపై విరుచకుపడింది. ఒక్కరోజులోనే 150 టన్నెల్ టార్గెట్లను కూడా ఛేదించగలిగింది.
ఇదెలా సాధ్యమైంది? అత్యంత అధునాతన కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ టార్గెట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ సైన్యం రూపొందించుకుంది. దాని ప్రకారం ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్లగలుగుతున్నామని సీనియర్ సైనికాధికారి ఒకరు తెలిపారు. ఐడీఎఫ్ నిఘా అధికారుల సమాచారం, ఏఐ పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకుంటూ బలగాలు ముందుకెళ్తున్నాయి.
వివిధ రూపాల్లో ఏఐ టెక్నాలజీని ఐడీఎఫ్ 2019నుంచే వినియోగిస్తోంది. భూతల యుద్ధంలో ఏఐ టార్గెట్ బ్యాంక్ యూనిట్ సేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. హమాస్ గెరిల్లా యుద్ధతంత్రాలను రియల్ టైమ్‌లో పసిగడుతూ.. వాటిని తిప్పికొట్టేలా ఈ యూనిట్ రాటుదేలింది. 2021 మేలో జరిగిన గాజా యుద్ధం అనుభవాల నుంచి ఇజ్రాయెల్ ఎంతో నేర్చుకుంది.
అప్పట్లో హమాస్ సొరంగాలను కొంత మేర ధ్వంసం చేసింది. ఆ ఎత్తుగడలకు మరింత పదును బెట్టి.. ఇప్పుడు ఏకంగా హమాస్ మిలిటెంట్లకు కేంద్రంగా ఉన్న గాజా సిటీని సంపూర్ణంగా చుట్టుముట్టింది. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకోవడం వల్ల గాజా టన్నెళ్లను శాశ్వతంగా ధ్వంసం చేయడంలో విజయం సాధించామని ఐడీఎఫ్ సీనియర్ సైనికాధికారి ఒకరు చెప్పారు. లెబనాన్ టార్గెట్ బ్యాంక్‌లో వందల సంఖ్యలో లక్ష్యాలను ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్ పొందుపర్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య వేలకు చేరింది. 2019 కన్నా ముందు మిలిటెంట్లు లేదా వారి స్థావరాలకు సంబంధించి పది టార్గెట్లను ఛేదించేందుకు పది రోజుల సమయం పట్టేది. ఇప్పుడైతే పది రోజుల వ్యవధిలోనే 100 లక్ష్యాలను అవలీలగా ఛేదించగలుగుతున్నారు. ఇప్పటివరకు ఈ పోరులో 9 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ లో 130 మంది ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. ఇజ్రాయెల్‌లో 1400 మందికిపైగా మరణించారు.