Jammu Kashmir Tourism: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్థానికులు, టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా సంస్థల సిఫార్సు మేరకు దాదాపు 48 రిసార్ట్‌లు, అనేక ప్రధాన పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులు మరణించిన కారణంగా స్థానిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
48 రిసార్టులు, అనేక పర్యాటక ప్రదేశాలు మూసివేత:
దుధ్‌పత్రి, వెరినాగ్, గుల్మార్గ్, సోనామార్గ్ , దాల్ సరస్సు వంటి ప్రాంతాల్లోని రిసార్ట్‌లు, పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేసారు. ఎందుకంటే ఇక్కడికి ప్రతి రోజు వేలల్లో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుండి వస్తారు. ఇక్కడ అందమైన లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రశాంతమైన సరస్సులు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ ప్రస్తుతం.. ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రదేశాలలో తాత్కాలిక ఆంక్షలు విధించింది.
కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ:
ఈ నిర్ణయం కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారి, ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత నెమ్మదిగా తిరిగి ట్రాక్‌లోకి వస్తున్న పర్యాటక పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. ఇది స్థానిక ప్రజలు, హోటళ్ల యజమానులు , వ్యాపారవేత్తల ఆదాయంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అదనంగా.. పెట్టుబడిదారులలో, పర్యాటక రంగంలో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
ఉగ్రవాద స్లీపర్ సెల్స్ :
కాశ్మీర్ లోయలో దాక్కున్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ మరో దాడికి ప్రణాళిక వేస్తున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి. భద్రతా దళాల చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాద సంస్థ టిఆర్‌టి (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) కొత్త లక్ష్యాల కోసం వెతుకుతోందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. సున్నితమైన ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, కాశ్మీర్‌లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 మూసివేయబడ్డాయి.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ కమాండో.. అడ్డంగా దొరికిపోయిన పాపిస్తాన్..
ప్రత్యేక పోలీసు దళాలు, యాంటీ ఫిదాయిన్ స్క్వాడ్‌ల మోహరింపు:
ఈ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోలీసు దళాలను, యాంటీ ఫిదాయీన్ స్క్వాడ్‌లను కూడా మోహరించింది. దాల్ లేక్, గుల్మార్గ్, సోనామార్గ్ వంటి ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇది కేవలం తాత్కాలికమేనని.. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే వివిధ ప్రదేశాలను తిరిగి తెరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం.. పర్యాటకులు , సాధారణ పౌరులు సహకరించాలని వెల్లడించింది.