Kamal Haasan Thalapathy Vijay Prashant Kishore | తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. లోకనాయకుడు కమల హాసన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన క్రీయాశీలకంగా లేరు. కానీ అధికార డిఎంకె పార్టీకి ఆయన మద్దతుదారుడు. దీంతో ఆయనకు పార్లమెంటు సభ్యత్వం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని తమిళ మీడియా కథనాలు ప్రచురించింది.
మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడైన నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారని తాజా సమాచారం. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వెల్లడయ్యాయి. కమల్ హాసన్ నివాసానికి బుధవారం రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లడంతో ఈ ప్రచారం మొదలైంది.
ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎంఎన్‌ఎం భాగం. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్ సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.
Also Read: రెండు రోజులు వెళ్లొద్దు.. కుంభమేళాలో 350 కి.మీ ట్రాఫిక్ జామ్
జూన్ 2025 నాటికి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో నటుడి నివాసానికి మంత్రి శేఖర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభకు నామినేట్ చేయడం గురించి గతంలో ఇచ్చిన హామీపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ఎంఎన్‌ఎం విడుదల చేసింది.
ఈ విషయంపై ఎంఎన్‌ఎం ప్రతినిధి మురళి అప్పాస్ స్పందించారు. పార్టీ నుంచి ఎవరిని ఎగువసభకు పంపాలనేది అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కమల్ హాసన్ 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు, గ్రామాల సాధికారత కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
దళపతి విజయ్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Polls) ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నటుడు విజయ్ సారథ్యంలో కొత్తగా ఏర్పడిన తమిళ వెట్రి కళగం (TVK) నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే (Prashant Kishor) ప్రత్యేక సలహాదారుగా ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై తమిళ పార్టీలు స్పందించాయి. పీకే-విజయ్ భేటీని ప్రధాన తమిళ పార్టీల నాయకులు అప్రధాన్యమైనవిగా కొట్టిపారేశాయి. కానీ ప్రశాంత్ కిషోర్ గత అనుభవం తెలిసిన రాజకీయ నిపుణులు మాత్రం దీన్ని సీరియస్‌గానే పరిగణిస్తున్నారు.
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ పార్టీకి 15 నుంచి 20 శాతం ఓటు షేర్ ఉండవచ్చని ప్రశాంత్ కిశోర్ అంచనా వేసినట్లు సమాచారం. అయితే, దీనిని మరింత పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై డీఎంకే నేత, మంత్రి శేఖర్ బాబు స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓట్లు అడిగే ప్రతి పార్టీ తమకే 100 శాతం ఓట్లు వస్తాయని ప్రకటించుకోవడం పరిపాటేనన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin)ను మరోసారి ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ.. ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పీకే ఓ రాజకీయ పార్టీకి సేవలందిస్తే తమకేమీ ఇబ్బంది లేదన్నారు. సినీ గ్లామర్ ఒక్కటే రాజకీయాల్లో విజయానికి దోహదం చేయదని సీపీఎం నేత బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. బిహార్ ఉపఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల ఓటమిపై పీకే స్పందన తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ఎన్‌టీకే పార్టీ చీఫ్ సీమాన్ ప్రశాంత్ కిశోర్ పర్యటనపై మాట్లాడుతూ.. పీకే వ్యూహాలపై తనకు విశ్వాసం లేదన్నారు. విజయ్ పనితీరుపైనే టీవీకే పురోగతి ఆధారపడి ఉంటుందని డీఎండీకే నేత ప్రేమలతా విజయ్‌కాంత్ కూడా అభిప్రాయపడ్డారు. విజయ్ పార్టీతో పొత్తు అంశాన్ని ఆ పార్టీనే అడగాలని.. అన్నాడీఎంకేతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆమె అన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఈ సారి టీవీకేతో మంతనాలు జరపడం గమనార్హం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీలతో పొత్తు అవకాశాలు వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం.