Karnataka Cabinate: ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తైంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణను పూర్తి చేసింది సీఎం సిద్ధరామయ్య సర్కార్. ఈరోజు గవర్నర్ సమక్షంలో కొత్తగా 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే వీరికి శాఖల కేటాయింపు ఆదివారం జరగున్నట్టు తెలుస్తోంది.
కొత్తగా 24 మంది ప్రమాణస్వీకారం చేయడంతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 32కు చేరింది. కొత్త కేబినెట్‌లో లింగాయత్ వర్గానికి చెందిన వారు 8 మంది ఉండగా.. ఎస్సీలు ఏడుగురు, ఐదుగురు వొక్కలిగ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఇక ఇద్దరు ముస్లీంలు, ముగ్గురు ఎస్టీలు, ఆరుగురు ఓబీసీ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఇక బ్రహ్మణ, క్రిస్టియన్, జైన్ వర్గానికి చెందిన ఒక్కొక్కరు కేబినెట్‌లో చోటు దక్కించుకన్నారు.
ఇక కర్ణాటక కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళ మంత్రిగా లక్ష్మీ హెబల్కర్ చోటు దక్కించుకున్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా మంత్రివర్గాన్ని విస్తరించామని కాంగ్రెస్ ప్రకటించింది.
మంత్రివర్గ విస్తరణకు ముందు విస్తృత చర్చలు జరిపారు హస్తం పార్టీ నేతలు. నేతల జాబితాను ఢిల్లీకి తీసుకెళ్లి హైకమాండ్ ముందు ఉంచారు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అనేక చర్చల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ ఈ లిస్ట్‌ను ఆమోదించింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మంత్రుల జాబితాను గవర్నర్ కార్యాలయానికి పంపారు సీఎం సిద్ధరామయ్య. శనివారం కొత్తగా 24మంది ప్రమాణ స్వీకారం చేయడంతో కేబినెట్ సైజ్ 32కు పెరిగింది.