Karnataka: కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే పలు పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు హామీల మీద హామీలు కుమ్మరిస్తున్నారు. ఆఫర్లు ఇస్తూ తమ వలలో వేసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ జార్కి హోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో సుళేబావి నియోజకవర్గం నుంచి రమేష్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాల్కర్పై చేతిలో ఓడిపోయారు. ఈక్రమంలో ఆమె గత ఎన్నికల్లో తాయిలాలు పంచిందంటూ ఆరోపిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లక్ష్మి పోయిన ఎన్నికల్లో తాయిలాలు పంచింది. దాని విలువ మహా అయితే మూడు వేలు ఉంటుంది. నేను ఏకంగా ఆరు వేలు ఇస్తాను. మీ అందరూ నాకే ఓటు వేయాలి’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రమేష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఒకవైపు ఉచితాలకు తాము వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా… ఆ పార్టీ నేతలు ఇటువంటి హామీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.