Kashmir University Students : డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి ఉన్నవారు అన్నం తినడానికి వెనుకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందులో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిండి పదార్థం తక్కువగా ఉండే ఆహార పదార్థాలనే ఇష్టపడతారు.
సరికొత్త స్టార్చ్ రైస్ కుక్కర్ ఉంటే పిండి అన్నం తినడం గురించి భయపడే అవసరమే లేదంటున్నారు. దీన్ని కాశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు తయారు చేశారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ జహంగీర్ హమిద్ లోనె, ఇమ్రాన్ నజీర్, సాజిద్ నూర్, అజుర్ హుస్సేన్ అనే నలుగురు స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. వీరికి బిలాల్ అహ్మద్ మాలిక్ అనే ప్రొఫెసర్ తోడ్పాటును అందించారు. మొత్తంగా అందరూ కలిసి తయరు చేసిన ఈ స్టార్చ్ రైస్ కుక్కర్ కు ఈ నెల 13న పేటెంట్ హక్కులు కూడా పొందారు. నిజానికి వీరు ఈ ప్రయోగాన్ని జనవరిలోనే చేపట్టారు. ఈ ఆవిష్కరణని మెచ్చుకున్న కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా… వీరందరికి అవార్డుతో సత్కరించారు.
ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది?
సాధారణంగా రైస్ కుక్కర్లు మ్యానువల్ గా పనిచేస్తాయి. కానీ స్టార్చ్ రైస్ కుక్కర్ కు అలాంటి ఫెసిలిటీ ఉండదు. ఇదంతా ఆటోమేటిగ్గా అంటే మంబీ అనే సాఫ్ట్ వేర్ సాయంతో పనిచేస్తుంది. పైగా ఇది ఒక టెక్ట్స్ మెసేజ్ తో పనిచేస్తుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకదానిలో బియ్యం, మరోదానిలో నీళ్లు పోయాయి. ఫోన్ నుంచి మెసేజ్ రాగానే పనిమొదలు పెడుతుంది. బియ్యం, నీళ్లను సమపాళ్లలో ఆటోమేటిగ్గా తీసుకుంటుంది. అంతేకాదు అన్నం ఉడుకుతున్న టైంలో… అందులో పిండిపదార్థం శాతం ఎంత ఉందనేది కూడా డిస్ ప్లే చేస్తుంది. అన్నం ఉడికే వరకు ఇలాంటి సమాచారం ఇస్తూనే ఉంటుంది. ఇక అన్నం వండడం పూర్తయిన సమాచారాన్ని మెసేజ్ రూపంలో అందిస్తుంది. ఈ సరికొత్త ఆవిష్కరణ త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానుందని తెలిపారు దీన్ని తయారు చేసిన విద్యార్థులు.