తండ్రి ఆస్తిలో కుమార్తెకు హక్కు కచ్చితంగా ఉంటుందని భారత రాజ్యాంగంలోని హిందూ వారసత్వ (సవరణ) చట్టం- 2005 చెబుతోంది. తండ్రి ఆస్తిలో సరే, మరి తాత ముత్తాతల ఆస్తిలో కూడా ఆమెకు వాటా ఇవ్వాల్సిందేనా..? ఇవ్వడం కుదరదు అని చెప్పిన కుటుంబ సభ్యులపై ఓ యువతి కోర్టుకెక్కింది. కేరళ హై కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తండ్రి ఆస్తిలోనే కాదు, తాత ముత్తాతల ఆస్తిలో కూడా మహిళలకు వాటా ఉంటుంనది స్పష్టం చేసింది.
హిందూ వారసత్వ (సవరణ) చట్టం -2005
గతంలో కొడుకులనే వారసులుగా పరిగణించేవారు. తండ్రి ఆస్తిని కొడుకులే వారసత్వంగా అనుభవించేవారు. వివాహ సమయంలో ముట్టజెప్పే కట్నకానుకలు మినహా కూతుళ్లకు తండ్రి ఆస్తిలో వాటా లేదని వేరుగా చూసేవారు. కానీ హిందూ వారసత్వ (సవరణ) చట్టం -2005 కూతుళ్లు కూడా తండ్రి ఆస్తికి వారసులే అని స్పష్టం చేసింది. వివాహంతో సంబంధం లేకుండా కూతుళ్లు అందరూ తండ్రి ఆస్తికి వారసులే. వివాహిత కుమార్తెలు కూడా తమ తండ్రి ఆస్తిలో సమాన వాటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాల్లో జన్మించిన అమ్మాయిలకు వారు పుట్టినప్పటి నుండి తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది.
కేరళ హైకోర్టు తీర్పు..
తాజాగా కేరళ హైకోర్టు ముందుకు మరో కేసు వచ్చింది. తండ్రి ఆస్తితోపాటు, ఆయనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో కూడా తనకు వాటా ఇవ్వాలంటూ ఓ యువతి కేరళ హైకోర్టుని ఆశ్రయించింది. ఆమె సోదరులు తండ్రి ఆస్తిని పంచి ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ, వారసత్వంగా వచ్చిన ఆస్తికి మాత్రం తామే హక్కుదారులమని చెప్పారు. దీంతో ఆమె కోర్టుని ఆశ్రయించింది. పూర్వీకుల ఆస్తిలో కూడా తనకు సమాన వాటాలు కావాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని విచారించిన కేరళ హైకోర్టు.. మహిళలకు కూడా వారసత్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. 2004 డిసెంబర్ 20 తర్వాత మరణించిన హిందూ వ్యక్తుల కుమార్తెలు పూర్వీకుల ఆస్తిలో సమాన వాటాలకు అర్హులని తీర్పు ఇచ్చింది. సెక్షన్ 6లోని సబ్-సెక్షన్ (5), సెక్షన్ 6లోని సబ్-సెక్షన్ (5)కి వివరణ కింద ఇచ్చిన మినహాయింలకు లోబడి మహిళలకు ఆ హక్కు కచ్చితంగా ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. తండ్రి ఆస్తిలో వాటాను చట్ట ప్రకారం తీసుకుంటున్నా, పూర్వీకుల ఆస్తుల విషయంలో మాత్రం చాలామంది తర్జన భర్జన పడుతున్నారు. పూర్వీకుల ఆస్తులు మగ పిల్లలే అనుభవిస్తున్న ఉదాహరణలు కోకొల్లలు. ఆ ఆస్తుల్లో ఆడబిడ్డలకు వాటా ఇవ్వడానికి కూడా వారు ఇష్టపడటం లేదు. ఇప్పుడు కేరళ హైకోర్టు తీర్పుతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. పూర్వీకుల ఆస్తుల్లో కూడా ఆడపిల్లలకు వాటా ఇవ్వాల్సిందేననే విషయం స్పష్టమైంది.
10మంది కొడుకులతో సమానం..
ఒక కూతురు 10మంది కొడుకులతో సమానం అంటూ స్కంద పురాణంలోని శ్లోకాన్ని హైకోర్టు తన తీర్పులో ఉటంకించడం ఇక్కడ విశేషం. “ఒక కుమార్తె 10 మంది కుమారులతో సమానం. 10 మంది కుమారులను కని పెంచడం ద్వారా ఒక వ్యక్తి ఏ ఫలాన్ని పొందుతాడో.. ఒక కుమార్తెను కనడం ద్వారా దానికి సమానమైన ఫలితాన్ని ఆయన పొందవచ్చు“ అని కోర్టు పేర్కొంది.