Kerala Campaign: స్వేచ్ఛ బ్యూరో: కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఏఐసీసీ తెలంగాణ పార్టీకి ఆదేశాలిచ్చింది. పవర్ లోకి తీసుకురావడంలో భాగస్వామ్యం కావాలని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఎంపిక చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించింది.
కేరళ ఎన్నికల ప్రచారానికి సిద్ధం
పూర్తి స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం, పర్యటనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేయాలని సూచించింది. దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా కేరళ ఎన్నికల ప్రచారానికి పాల్గొనేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు. వివిధ విభాగాల నుంచి విడతల వారీగా దాదాపు రెండు వందల మంది తెలంగాణ నేతలు కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు తెలిసింది. ఇందులో క్షేత్రస్థాయి నుంచి ముఖ్య నేతల వరకు పాల్గొననున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ఖర్గేలతో కలిసి కొన్ని మీటింగ్ లకు హాజరవుతుండగా, మరి కొన్ని నియోజకవర్గాల్లోని పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ నయా ప్లాన్ ఇదే!
సౌత్ స్టేట్స్ లో సత్తా చాటేందుకు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్టాటక, తెలంగాణలో పవర్ లో ఉన్నది. రాబోయే రోజుల్లో కేరళలోనూ అధికారం సాధించాలని దృడ సంకల్పంతో వర్క్ చేస్తున్నది. వరుసగా సౌత్ స్టేట్స్ లో గ్రిప్ సాధించాలని పార్టీ భావిస్తున్నది. ప్రస్తుతం బీజేపీ కి సౌత్ స్టేట్స్ లో ఆశించిన స్థాయిలో మేలేజ్ లేదు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలని ఫిక్స్ అయింది. తద్వారా దేశంలో అధికారంలోకి వచ్చేందుకు సులువైన మార్గం గా మారుతుందని అగ్రనేతలు ఆలోచిస్తున్నారు.
మలయాళ గడ్డపై రేవంత్ రెడ్డి మార్క్ స్ట్రాటజీ!
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా డీ లిమిలేషన్ అనే అంశంపై సౌత్ స్టేట్స్ అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రస్తావించారు. ఈక్రమంలో అన్ని సౌత్ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే బీజేపీ రాజకీయ వ్యూహాలు, విధానాలను సులువుగా చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. అంతేగాక దేశ కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేసిన కేసీ వేణుగోపాల్ ను కేరళ సీఎం చేయాలని అగ్రనాయకత్వం భావిస్తున్నది. దీంతో కేరళలో తప్పనిసరిగా కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలీలో స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో కర్ణాటక సహకారం…?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికే అధికారంలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీకి సపోర్టుగా నిలిచింది. అక్కడి మంత్రులు, కీలక నేతలు, ముఖ్య లీడర్లంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా డీకే శివ కుమార్ లాంటి కీలక నేతలు కూడా హైదరాబాద్ లో ఉండి బీఆర్ ఎస్ పార్టీని ఓడించేందుకు సర్వశక్తులా ప్రయత్నించారు. చాలా మంది నేతలు క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలోనూ తిరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘కర్ణాటక ఫార్ములా’ ఏ విధంగానైతే సక్సెస్ అయిందో, ఇప్పుడు అదే తరహాలో ‘కేరళ టాస్క్’ను తెలంగాణలో అమలు చేసేందుకు అగ్రనాయకత్వం సిద్ధమైంది.ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తూ…ప్రభుత్వంలోకి వచ్చేందుకు కీలక హామీలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అంతేగాక సోషల్ మీడియా ప్రచారానికి కూడా హైదరాబాద్ నుంచి ఓ స్పెషల్ టీమ్ పనిచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.కేరళలోని కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో ఈ టీమ్ కీలకంగా వ్యవహరిస్తుంది.
Also Read:హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక ప్రయాణం ఫ్లైట్ లాగే!