సంక్షేమ పథకాలన్నీ నిజంగా లబ్ధిదారులకే ప్రయోజనం చేకూర్చుతాయా? కచ్చితంగా కాదనే చెప్పాలి. కొంతమంది, కొన్ని సందర్భాల్లో చాలామంది, ఇంకొన్ని రాష్ట్రాల్లో అసలు లబ్ధిదారులకంటే అనర్హులే ఎక్కువగా లబ్ధి పొందుతుంటారు. అయితే మరీ పురుషుల పథకాల్లో మహిళలు, మహిళలకు కేటాయించిన పథకాల్లో పురుషులు లబ్ధిదారులుగా ఉండటం అరుదు. అలా జరిగిన ఉదాహరణలు కూడా చాలా తక్కువ. కానీ మహారాష్ట్రలో ఆ అద్భుతం జరిగింది. బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే ఈ జంబలకిడి పంబకు కారణం. తీరా అసలు విషయం బయటపడ్డాక ప్రభుత్వం నాలుక కరుచుకుంది. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రభుత్వంపై మచ్చపడింది. నిధుల దుర్వినియోగానికి ప్రభుత్వం సహకారం ఉందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిందను అధికారులపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటోంది.
లడ్కీ బహెన్..
లడ్కీ బహెన్ పథకం. పేరులోనే మహిళల ప్రస్తావన ఉంది. పేరే కాదు, ఆ పథకం పూర్తిగా మహిళలకు సంబంధించినదే. 21 నుంచి 65 ఏళ్ల లోపు మహిళలు ఈ పథకానికి అర్హులు. వారికి నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందజేస్తుంది ప్రభుత్వం. అంటే ఏడాదికి 1 లక్షా 80 వేల రూపాయలు. నిరుపేదలకు ఇది చాలా ఉపయోగం అనే చెప్పాలి. చాలా కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధిపొందాయి. అయితే ఇక్కడ మహిళలతోపాటు పురుషులు కూడా లబ్ధిపొందడం విశేషం. పురుష లబ్ధిదారుల పేర్లు కూడా ఈ పథకంలో నమోదయ్యాయి. ఒకరిద్దరు కాదు 14వేలమంది పురుషులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందింది. మహిళా శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన ఆడిట్ లో అసలు విషయం బయటపడింది. దీంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అధికారుల్ని బలిచేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
అనర్హులకు గ్యారెంటీ..
ఏ పథకం అయినా అర్హులకు లబ్ధి చేకూర్చాల్సి ఉంటుంది. కానీ లడ్కీ బహెన్ పథకం అనర్హులకే ఎక్కువగా ఉపయోగపడిందని చెప్పాలి. వాస్తవానికి ఈపథకానికి అర్హత సాధించాలంటే కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షలకంటే తక్కువ ఉండాలి. కానీ కార్లు ఉన్నవారు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. దాదాపు 1.62 లక్షల మంది ఉన్నతాదాయ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకంలో నమోదైనట్టు తెలుస్తోంది. ఒక కుటుంబానికి సంబంధించి ఇద్దరు మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కానీ కొన్ని కుటుంబాల్లో ముగ్గురు మహిళలు కూడా లబ్ధిపొందారు. ఇలా దాదాపు 7.97 లక్షల మంది అనర్హులకు ఈ పథకం ఆర్థిక సాయం చేసింది. మూడో మహిళ లబ్ధిదారుగా చేరడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1,196 కోట్లు ఖర్చయ్యాయి. ఇక వయోపరిమితి విషయంలో కూడా పెద్ద ఫ్రాడ్ జరిగింది. గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు కాగా, 65 ఏళ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు కూడా ప్రయోజనం పొందడం విశేషం. అధిక వయసు ఉన్న లబ్ధిదారుల కారణంగా ప్రభుత్వానికి రూ.431.7 కోట్లు అదనంగా ఖర్చయింది.
వెనక్కి తెప్పిస్తాం..
ముందుగా అధికారులు పురుష లబ్ధిదారులను టార్గెట్ చేశారు. మొత్తం 14,298 మంది వివరాలు సేకరించారు. వారి నుంచి ఆర్థిక సాయాన్ని తిరిగి వసూలు చేస్తామని చెబుతున్నారు. మొత్తం రూ.21.44 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. అసలు ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు పురుషుల పేర్లు ఎందుకు చూడలేదు, వారి ఫొటోలు, ఇతర వివరాలు ఎందుకు వెరిఫై చేయలేదు అనే కోణంలో విచారణ మొదలైంది. ఈ స్కామ్ కి సహకరించినవారిని కూడా శిక్షిస్తామంటోంది ప్రభుత్వం.