న్యూమరాలజీ – సంఖ్యా శాస్త్రం.. దీన్ని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఈ న్యూమరాలజీపై ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఫలానా తేదీన నామినేషన్ వేయాలి, ఫలానా టైమ్ లోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాలి.. ఫలానా ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేయాలి.. ఇలా రకరకాల లెక్కలు వేసుకుంటారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి కూడా ఇలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన లక్కీ నెంబర్ 1206. అయితే అదే లక్కీ నెంబర్ ఆయన మరణాన్ని కూడా నిర్దేశించిందని తెలిస్తేనే వళ్లు జలదరిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆ లక్కీ నెంబర్ ని విశ్వసిస్తూ వచ్చిన విజయ్ రూపానీ.. చివరకు అదే నెంబర్ గల తేదీన అకాల మరణం చెందారు.
1206..
విజయ్ రూపానీ లక్కీ నెంబర్ 1206. ఆయన బైక్ కి, కారుకి కూడా అదే నెంబర్ ఉంటుంది. ఇతరత్రా కొన్ని విషయాల్లో కూడా ఆయన 1206ని ఎక్కువగా నమ్ముతారు. కానీ విధి ఎంత విచిత్రమైందో కదా. ఆ లక్కీ నెంబర్ గల తేదీనే ఆయన చనిపోవడం ఆశ్చర్యం. జూన్ 12వతేదీ అంటే 6 వ నెల 12 తేదీ.. అలా అది 1206 అయింది. అదే రోజు ఆయన చనిపోతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆ మాటకొస్తే ఈ అకాల మరణాన్ని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పండి. విమాన ప్రమాదం, అది కూడా సరిగ్గా 1206న జరగడం విజయ్ రూపానీ విషయంలో విధి విచిత్రమనే చెప్పాలి. మాజీ సీఎం విజయ్ రూపానీ అదృష్ట సంఖ్యే ఆయనకు దురదృష్ట సంఖ్యగా మారిందని అంటున్నారు.
సీట్ నెంబర్ 12
ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉంది. డ్రీమ్ లైనర్ ఫ్లైట్ లో విజయ్ రూపానీ సీట్ నెంబర్ 12. ఇది కూడా ఆయన లక్కీ నెంబర్ లో భాగమే. 11వ సీట్ లో ఉన్న వ్యక్తి మృత్యుంజయుడుగా విమానం నుంచి బయటకు రాగా, విజయ్ రూపానీ చనిపోవడం దురదృష్టకరం.
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రమాదంలో మృతి చెందిన వారు, చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవడం, ఇతరత్రా కారణాలవల్ల బతికిపోయిన కుటుంబాల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో విజయ్ రూపానీ గురించి కూడా చర్చ నడుస్తోంది. ఆయన లక్కీ నెంబర్ 1206 అని, ఆయనకు అదే నెంబర్ తో బైక్, కార్ ఉన్నాయని.. వాటి ఫొటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
విజయ్ రూపానీ.. 1956 ఆగస్ట్ 22 న అప్పటి బర్మా రాజధాని రంగూన్‌లో జన్మించారు. ఆయన కుటుంబం 1960లో భారత్‌కు వలస వచ్చి, గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో స్థిరపడింది. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు. 1987లో రాజ్‌కోట్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాలక్రమంలో రాజ్‌కోట్ మేయర్‌గా, తర్వాత రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2014లో తొలిసారి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన విజయ్ రూపానీ, ఆనందీబెన్ పటేల్ మంత్రి వర్గంలో పనిచేశారు. 2016లో గుజరాత్ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టి, ఆ తర్వాత సీఎం అయ్యారు. ఐదేళ్లపాటు పూర్తి కాలం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.
లండన్‌లో ఉన్న కుమార్తె, భార్యను కలిసేందుకు విజయ్ రూపానీ, ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో లండన్ బయలుదేరారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆయన అసువులుబాశారు. గతంలో గుజరాత్ మాజీ సీఎం బల్వంత్‌రాయ్ మెహతా కూడా విమాన ప్రమాదం లోనే చనిపోయారు. మళ్లీ ఇప్పుడు విజయ్ రూపానీ కూడా అలాంటి ప్రమాదంలోనే కన్నుమూశారు.