Madhya Pradesh Brahmin 4 Children| మధ్యప్రదేశ్ ప్రభుత్వాధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. తమ సామాజిక వర్గం జనాభా పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని బ్రాహ్మణులకు పిలుపునిచ్చింది. నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు రూ. లక్ష నజరానా ఇస్తామని ప్రకటించింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఇందోర్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ ప్రకటన చేశారు. ‘‘మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశాం. ఈ మధ్య యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారు. ఇది రానున్న కాలంలో మరింత సమస్యాత్మకంగా మారుతుందని తాను గుర్తించాను. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అందుకే దంపతులు కనీసం.. నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నా’’ అని రాజోరియా చెప్పారు.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాలదే జోరు.. పథకాలతో పార్టీల మధ్య తీవ్రపోటీ
‘‘యువతపై నాకు చాలా ఆశలు ఉన్నాయి… వృద్ధుల నుంచి మనం పెద్దగా ఆశించలేము… భవిష్యత్తు తరాన్ని రక్షించే బాధ్యత యువతపై ఉంది. కనుక యువత నిర్వీర్యం కాకుండా ఉండాలంటే కనీసం నలుగురు పిల్లలు ఉండాలి. అందుకే నేను ఈ ప్రకటన చేస్తున్నాను. అంతేకాదు పరశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడిగా నేను ఉన్నా లేకున్నా ఈ అవార్డ్ కొనసాగుతుంది’’ అని రాజోరియా ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.
అంతేకాదు భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని భావించిన తాను ఈ ప్రకటనను వ్యక్తిగతంగా చేసినట్లు, ఈ ఆలోచన ప్రభుత్వానిది కాదని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజం కట్టుబాట్లను అనుసరిస్తుందని, పిల్లల భవిష్యత్ కోసం ఉన్నత స్థానంలో నిలిపేందుకు పిల్లలకు మంచి విద్య, శిక్షణ అందించాలి అని ఆయన చెప్పారు.
రాజోరియా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు
రాజోరియా ప్రకటనకు అధికార భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆయన అభిప్రాయంతో విభేదించారు. రాజోరియా చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం అని కాంగ్రెస్ నేత ముఖేష్ నాయక్ పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన తన ప్రకటనపై ‘‘పునరాలోచించుకోవాలని’’ కోరారు.
రాజోరియా తనకు మంచి స్నేహితుడు అని, ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సమస్య జనాభా పెరుగుదలనేనని ముఖేష్ అన్నారు. ‘‘పిల్లలు ఎంత తక్కువగా ఉంటే, వారికి మంచి విద్యను అందించడం సులభం అవుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌లో హిందువుల సంఖ్యను ముస్లింలు మించిపోతారనే ఆలోచన ఒక భ్రమ అని నాయక్ అన్నారు. ‘‘ఇలాంటివి ఊహలు మాత్రమే.. మనం ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన దేశం శక్తివంతం అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.