CM Fadnavis Aurangazeb| మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) రాజకీయాల కోసం మతాన్ని సాధనంగా వినియోగించుకుంటున్నారని.. ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb)వంటి క్రూరుడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ (Congress) చీఫ్ హర్షవర్దన్ సప్కల్ విమర్శించారు. ‘‘ఔరంగజేబు క్రూరమైన పరిపాలకుడు. అతడు తన సొంత తండ్రిని జైల్లో పెట్టాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడణవీస్ కూడా అటువంటి క్రూర స్వభావం గలవారే. మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రజల్లో విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వీరిద్దరి పరిపాలన ఒకేవిధంగా కనిపిస్తోంది.’’ అని హర్షవర్దన్ తీవ్ర విమర్శలు చేశారు.
ఫడణవీస్‌ను ఔరంగజేబుతో పోల్చడాన్ని బిజేపీ (BJP) తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతికి ఉన్న గుర్తింపును అవమానిస్తూ.. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందని మహారాష్ట్ర బిజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే దుయ్యబట్టారు. ఔరంగజేబుతో ఫడణవీస్‌ను పోల్చడం.. హస్తం పార్టీకి ఉన్న బాధ్యతారాహిత్యాన్ని, ఆ పార్టీ నాయకుల పిల్ల చేష్టలను తెలియజేస్తోందని ఆయన అన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆ కాస్త మద్దతు కూడా పోతుందని ఎద్దేవా చేశారు.
ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న బీజేపీ నాయకుడు.. మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి ఫడణవీస్
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి మహారాష్ట్ర భూభాగంలో ఉండగా.. ప్రస్తుతం ఈ సమాధిని తొలగించాలని పలువురు మహారాష్ట్ర రాజకీయ నాయకులు డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ సమాధిని జేసీబీలతో కూల్చివేయాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎంపీ డిమాండ్ చేశారు. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మాత్రం మద్దతు ఇస్తూనే ఈ సమాధి తొలగింపు అన్నది జేసీబీలతోకాకుండా, న్యాయపరంగా తొలగించాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఔరంగజేబు సమాధి ఉన్న స్థలం జాతీయ పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలో ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు.
Also Read: కర్ణాటకలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ రాహుల్ గాంధీ కుట్రే.. బిజేపీ విమర్శలు
చక్రవర్తి ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా ఖుల్తాబాద్ ప్రాంతంలో ఉంది. దీన్ని తొలగించాలని తాను కూడా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. అయితే ఈ ప్రక్రియ చట్ట ప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు ఇప్పగించింది. దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫడణవీస్ తప్పుబట్టారు.
మరోవైపు, మహా సీఎం ఫడణవీస్ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన సతారా స్థానం ఎంపీ.. ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజె భోసాలె స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని, సింపుల్‌గా ఓ జేసీబీని పంపించి ఔరంగజేబు సమాధిని నేలమట్టం చేయాలని కోరారు.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ చిత్రం విడుదలైన అనంతరం.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును (Aurangzeb) కీర్తిస్తూ మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌ను వేధించిన ఔరంగజేబును ప్రశంసించడంపై అధికార కూటమి తీవ్రస్థాయిలో మండిపడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయనపై చర్యలకు పట్టుబట్టింది. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అంటే మార్చి 26 వరకు ఎమ్మెల్యే అజ్మీపై సస్పెన్షన్ విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందిస్తూ.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు గాను అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.