Ex Minister Son Flight Kidnap | ఒక రాష్ట్ర మాజీ మంత్రి కుమారుడు స్నేహితులతో కలిసి జల్సా కోసం బ్యాంకాక్ వెళ్లాలని ప్లాన్ వేశాడు. అందుకోసం ఒక ప్రైవేట్ విమానం బుక్ చేసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తీరా విమానంలో బ్యాంకాక్ బయలుదేరాక.. విమానం నడిపై పైలట్లకు కిడ్నాప్ అని ఒక ఫోన్ వచ్చింది. అంతే.. విమాన సిబ్బంది, పైలట్లు అంతా భయపడిపోయారు. ఆ తరువాత ఫోన్లో చెప్పినట్లు చేయాల్సి వచ్చింది. కొడుకు కిడ్నాప్ అయ్యాడంటూ ఆ మాజీ మంత్రి తన రాజకీయ నెట్ వర్క్ మొత్తం ఉపయోగించి.. విమానాన్ని తన కంట్రోల్ లో తెచ్చుకున్నాడు. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ హైడ్రామా ఘటన నిజంగానే జరిగింది. అయితే ఈ ఘటన గురించి మీడియాలో చాలా ఆలస్యంగా తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర మాజీ మంత్రి మరియు శివసేన నాయకుడు తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్, సోమవారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ ప్రయాణం కోసం బయల్దేరాడు. పుణె ఎయిర్‌పోర్టు నుంచి వారిని తీసుకెళ్లిన ఛార్టర్డ్ విమానం మార్గమధ్యంలో ఉండగా.. కుమారుడిని కిడ్నాప్ చేశారని తానాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, డీజీసీఏ సహాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. అప్పటికే అండమాన్ వరకు వెళ్లిన ఆ విమానం తిరిగి పుణెకు వచ్చి ల్యాండ్ అయ్యింది. బ్యాంకాక్ వెళ్లాలనుకున్న రిషిరాజ్ మరియు అతని స్నేహితులు పుణెలో దిగడంతో షాక్ అయ్యారు. విచారణలో వారి రహస్య ప్రయాణం బయటపడింది.
ఈ ఛార్టర్డ్ విమానాన్ని నడుపుతున్న ప్రైవేట్ కంపెనీ ఈ వ్యవహారంపై స్పందించింది. “మొదట్లో మాకు ప్రయాణికుడి (రిషిరాజ్) కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించాలని కోరారు. కానీ, మేము దాన్ని నమ్మలేదు. కొన్నిసార్లు ఇలాంటి ఆకతాయి ఫోన్లు వస్తుంటాయని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత పౌర విమానయాన శాఖ మరియు డీజీసీఏ నుంచి ధృవీకరణ తీసుకున్నాం. ఇది కిడ్నాప్ కేసు అని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసిన తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లించాం,” అని ఎయిర్‌లైన్ సిబ్బంది వివరించారు.
“సాధారణంగా సాంకేతిక లోపం లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే విమానాన్ని ఇలా వెనక్కి మళ్లిస్తాం. కానీ, ప్రయాణికులపై క్రిమినల్ కేసు కారణంగా విమానాన్ని వెనక్కి తీసుకురావడం ఇదే తొలిసారి. గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో, విమానాన్ని దారి మళ్లిస్తున్నట్లు మా సిబ్బంది మరియు పైలట్లు ప్రయాణికులకు చెప్పలేదు. వారి ముందున్న నావిగేషన్ మ్యాప్‌లను కూడా ఆఫ్ చేశారు. విమానం పుణె ఎయిర్‌పోర్టులో దిగే వరకు వారికి ఈ విషయం తెలియదు. ల్యాండ్ అయ్యాక, సీఐఎస్‌ఎఫ్ అధికారులు వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు,” అని ఎయిర్‌లైన్ సిబ్బంది వివరించారు.
రిషిరాజ్ రహస్య ప్రయాణం గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు. అదే సమయంలో, అతడిని కిడ్నాప్ చేశారని పుణె పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తానాజీకి కూడా ఈ సమాచారం తెలిసింది. ఆయన పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, డీజీసీఏను సంప్రదించారు. అయితే ఈ హైడ్రామాపై ప్రతి పక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనై మాజీ మంత్రి కుమారుడు రిషిరాజ్ సావంత్ స్పందిస్తూ.. తాను బిజినెస్ ట్రప్ కోసం బ్యాంకాక్ కు బయలుదేరినట్లు చెప్పారు. కానీ అతని మాటలు సందేహాస్పదంగా ఉన్నాయి.