Deepika Padukone:ప్రతి ఏడాది భారత ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ‘పరీక్ష పే చర్చ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈసారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో నరేంద్ర మోడీతో పాటు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) , ఆధ్యాత్మిక గురువు సద్గురు (Sadguru), బాక్సర్ మేరీకోమ్ (Mary Kom) తో పాటు యూట్యూబర్ రాధిక గుప్తా(Radhika Gupta) అలాగే పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని, ఏ విషయాన్ని అయినా సరే మానసిక ఒత్తిడికి గురైయ్యేలా సీరియస్ గా తీసుకోవద్దు అంటూ ప్రముఖులు తెలియజేశారు. ఇకపోతే తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను..
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ దీపికా పదుకొనే తన జీవితంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చింది. అందులో దీపికా పదుకొనే మాట్లాడుతూ.. ” ఒకానొక సమయంలో నేను కూడా తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుని, చనిపోవాలనుకున్నాను. అయితే చనిపోయేందుకు ఎన్నో రకాలుగా ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాను. ముఖ్యంగా చదువుకునే రోజుల్లో చదువు కంటే క్రీడల పట్ల ఆసక్తి.. ఆ తర్వాత కొన్నాళ్ళకు మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది. ఇక తర్వాత మోడలింగ్ నుంచి నటన వైపు వచ్చాను. ఆసక్తి ఉన్న వైపు అడుగులు వేయాలని అప్పుడే ఎటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండదని నేను భావిస్తాను” అంటూ దీపిక చెప్పుకొచ్చింది.
ఇతరుల సలహా తప్పనిసరి..
ఇక ఇదే విషయంపై ఆమె మళ్ళీ మాట్లాడుతూ.. “2014లోనే నేను మానసిక కుంగుబాటుకు గురయ్యాను. నాలో నేనే బాధపడుతూ ఉండేదాన్ని. నా సమస్య ఏ ఒక్కరి కళ్ళకు కనిపించేది కూడా కాదు. కానీ ప్రతిక్షణం మనల్ని ఆ సమస్య వేధిస్తూ ఉండేది. అయితే ఇలాంటి సమస్యలతో మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ విషయం మనకు అర్థం కాదు. ముంబైలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సమస్య నాకు మరింత ఎక్కువైంది. ఒకసారి అమ్మ ముంబై వచ్చినప్పుడు చెప్పాను. ఆమె నా సమస్యను అర్థం చేసుకొని ఒకసారి సైకాలజిస్ట్ వద్దకు వెళ్ళమని చెప్పింది. అమ్మ చెప్పినట్టుగానే నేను సైకాలజిస్ట్ ను కలిసిన తర్వాత నాలో మార్పు వచ్చింది. ఆత్మస్థైర్యం పెరిగింది. నా విషయాలను, బాధలను సన్నిహితులతో పంచుకోవడం మొదలుపెట్టాను. ఎవరైతే నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటున్నారో వారికే నా బాధను చెప్పుకునేదాన్ని. అలా చాలా వరకు ఒత్తిడిని నేను తగ్గించుకోగలిగాను. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే, ఆ సమస్య దాదాపు చాలా వరకు తగ్గుతుందనేదే నా భావన” అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకునే . ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ వీక్ మూమెంట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇతరుల సలహాలు తీసుకొని ముందడుగు వేస్తే జీవితంలో సక్సెస్ సాధించవచ్చు అని దీపిక తన మాటలు ద్వారా చెప్పుకొచ్చింది.