Mamata Banerjee INDIA bloc| 2024 సంవత్సరంలో జరిగిన హర్యాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓడిపోవడంతో కూటమిలోని పార్టీలలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి పనితీరుని సమీక్షించుకుంటూ ఓటమికి కూటమి నాయకత్వ లోపమే కారణమని చాలా మంది ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనెర్జీ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి పగ్గాలు తాను చేపట్టడానికి రెడీ అంటూ ముందుకు వచ్చారు. మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించినా.. ఇతర ప్రతిపక్షపార్టీలు అందుకు సుముఖంగానే కనిపిస్తున్నాయి.
మమతా బెనర్జీ ఏమన్నారు?
ఇటీవల జరిగిన ఒక ఇంటర్‌వ్యూలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. ఇండియా కూటమి వైఫల్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే తాను నాయకత్వం వహించి కూటమి పనితీరుని మెరుగు పరుస్తానని చెప్పారు. ఇండియ కూటమి వ్యవస్థాపకుల్లో తాను కూడా ఉన్నానని గుర్తు చేశారు.
“ఇండియా కూటమి ఏర్పాటు సమయంలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు కూటమి నాయకత్వం వహించేవారిపై దాన్ని విజయవంతంగా నడిపే బాధ్యత ఉంది. వాళ్లు కూటమి సరిగా నడపలేకపోతున్నారు. ఇందులో నేను ఏమీ చేయలేను. నేను చెప్పేది ఒక్కటే అందరినీ కలుపుకొని పోవాలి.” అని అన్నారు.
Also Read: హోమ్ మంత్రి పదవి కోసం షిండే డిమాండ్.. మహారాష్ట్ర రాజకీయాలలో మళ్లీ పేచీ
మీడియా ఇంటర్‌వ్యూలో ఆమెకు విలేకరి.. మీరు ఎందుకు కూటమి పగ్గాలు చేపట్టడం లేదు?.. బిజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీరు ఇప్పటికే విజయం సాధించారు కదా? అని ప్రశ్నించారు. దానికి మమతా బెనర్జీ సమాధానం ఇస్తూ.. “నాకు కూటమి నాయకురాలిగా అవకాశం ఇస్తే.. దాన్ని సజావు నడుపేందుకు ప్రయత్నిస్తాను. నాకు బెంగాల్ బయటికి వెళ్లే ఆలోచన లేదు. నేను ఇక్కడి నుంచే కూటమిని నడపగలను.” అని చెప్పారు.
మమతా బెనర్జీ వ్యాఖ్యలను కొట్టిపారేసిన కాంగ్రెస్
బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. అమె వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ చీఫ్ విప్ మానికమ్ టాగోర్ మాట్లాడుతూ.. మమతా బెనెర్జీ ఇండియా కూటమికి లీడర్ కావాలనుకోవడం మంచి జోక్ అని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఆమె తన పార్టీని దేశవ్యప్తాంగా విస్తరించేందుకు చాలా కష్టపడ్డారు. కానీ ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ కు పరిమితమై ఉంది. దీంతో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.. బెంగాల్ కాకుండా ఇతర రాష్ట్రాలకు తన పార్టీని విస్తరించలేని ఆమె జాతీయ స్థాయిలో ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలదు. అసలు కూటమికి నాయకత్వం పగ్గాలు చేపట్టే అర్హత ఆమెకు ఉందా? అనేది ఆమె మరోసారి పరిశీలించుకుంటే మంచిది.
కాంగ్రెస్ నాయకుడు రాజేశ్ ఠాకుర్ మమతా బెనర్జీ వ్యాఖ్యలను సమస్ఫూర్తితో చెప్పిన సమాధానాలు మాత్రమేనని వర్ణించారు. “ఇంటర్‌వ్యూలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ఆమె కేవలం అవకాశం ఇస్తే నిరూపించేందకు ప్రయత్నిస్తాను అని చెప్పింది అంతే తప్ప ఆమె నిజంగా కూటమికి నాయకత్వం వహిస్తారని నేను అనుకోవడం లేదు.” అని రాజేశ్ ఠాకుర్ చెప్పారు.
సిపిఐ లీడర్ డి రాజా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “మమతా బెనర్జీ తన వ్యాఖ్యల ద్వారా ఏమి చెప్పాలనుకుందో? నాకు అర్థం కాలేదు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఇండియా కూటమి సమావేశం ఒకసారి మాత్రమే జరిగింది. అందరూ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ఇండియా కూటమి లక్ష్యం ఒక్కటే.. దేశ్ బచావో.. బిజేపీ హటావో (బిజేపీని తొలగించాలి.. దేశాన్ని కాపాడాలి). ఇదే కూటమిలోని అన్ని పార్టీల సంయుక్త లక్ష్యం. కానీ ఇక్కడ వేర్వేరు పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా స్పందిస్తున్నారు.” అని అన్నారు.
బెనర్జీకి ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్పీపీ పార్టీల మద్దతు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తే.. తాము సంతోషిస్తామని శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ ఎంపీ సుప్రియ సూలె అన్నారు. ఇండియా కూటమిలో బెనర్జీ ఎప్పడూ భాగమే.. ఆమె మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానంటే ఇది సంతోషకరమైన వార్త.
ఉద్ధవ్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తే పరిస్థితులు మెరుగవుతాయని చెప్పారు. తాను త్వరలోని కోల్ కతా వెళ్లి ఆమెతో చర్చల్లో పాల్లొంటానని చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఇండియా కూటమిలో భాగమైన సమాజ్ వాదదీ పార్టీ కూడా మమతా బెనర్జీని కూటమి నాయకురాలి ఉండేందుకు అంగీకారం తెలిపింది. సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రతినిధి ఉదయ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహిస్తే కూటమి బలపడుతుందని అభిప్రాయపడ్డారు..
బెంగాల్ బిజేపీ నాయకుడు లాకెట్ చట్టర్జీ కూడా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోతోంది. అందుకే మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహించాలని అనుకుంటోంది. అయితే ఆమెను ఏ విషయంలోనూ నమ్మలేము” అన్ని చెప్పారు.