Temple for alien god: గ్రహాంతరవాసులు ఉన్నారా? అని ఎవరినైనా అడిగితే .. అది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే అని చెబుతుంటారు. ఎందుకంటే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా రకరకాలుగా వాదనలు వినిపిస్తుంటాయి. గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చిపోతుంటారని కొందరు నమ్ముతుంటారు. ముఖ్యంగా బ్రిటన్, అమెరికా దేశాల్లో గ్రహాంతరవాసుల గురించి ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, తాజాగా గ్రహాంతర వాసి చర్చ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ వ్యక్తి గ్రహాంతరవాసికి గుడి కట్టాడు. అంతేకాదు.. ఆ గ్రహాంతరవాసికి రోజూ పూజలు కూడా చేస్తున్నాడు. ఈ వింత ఘటన ఎక్కడో కాదు.. మన ఇండియాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్ కు చెందిన లోగనాథన్ అనే వ్యక్తి స్థానికంగా శివాలయాన్ని నిర్మించాడు. అందులో శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ పక్కనే ఓ మండపంలో ఆగస్త్య మహర్శిని ప్రతిష్టించాడు. దాని పక్కనే మరో మండపాన్ని ఏర్పాటు చేసి అందులో గ్రహాంతరవాసి విగ్రహాలను ప్రతిష్టించాడు. దేవుళ్లతోపాటు గ్రహాంతరవాసి ప్రతిమకు అతను రోజూ పూజలు చేస్తున్నాడు. 11 అడుగుల లోతైన నేలమాళిగలో ఈ గుడిని ఏర్పాటు చేశాడు. ఈ ఆలయ నిర్మాణం 2021 నుంచి కొనసాగుతున్నది. అయితే, ఆలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున పరిమిత స్థాయిలోనే పూజలు సాగుతున్నాయని, కొద్దిరోజుల తరువాత నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పటి నుంచి అన్ని రకాల పూజలు జరుగుతాయని చెబుతున్నాడు.
Also Read: ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క మా ఇళ్లు తప్ప.. నాకు కన్నీళ్లు ఆగడంలేదు
‘నేను గ్రహాంతర దేవతలతోనూ మాట్లాడాను. వారి నుంచి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కూడా తీసుకున్నాను. ప్రపంచంలోనే ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతుండడంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని నేను నమ్ముతున్నాను. మరో విషయమేమంటే.. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత గ్రహాంతరవాసులు పట్టారు. ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాలలో రాశారు. అందుకే విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నాను’ అంటూ గ్రహాంతరవాసి గుడి నిర్మించిన లోగనాథన్ మీడియాతో చెప్పాడు.
ఇదిలా ఉంటే.. ఈ గ్రహాంతరవాసి ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.