Man Catches Wife Relation| ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య తన భర్తతో ఉంటూనే మరొక యువకుడిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన రెండో భర్తకు డబ్బులు పంపేందుకు తన మొదటి భర్తను నిలువునా దోచుకుంది. తన భార్య ప్రవర్తనపై అనుమానించిన ఆ మొదటి భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించాడు. ఆ తరువాత కోర్టులో భార్య అతనిపై ఎన్ని కేసులు పెట్టినా కోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతి అదే కంపెనీలో పనిచేస్తున్న యువకుడిని ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నారు. కొన్నినెలలపాటు వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగింది. అయితే పెళ్లికి ముందు ఆ యువతి మరో యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. దీని గురించి తెలుసుకున్న ఆ భర్త ఆమెను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కానీ ఆమె మాత్రం అదంతా పెళ్లికి ముందు తాను చేసిన తప్పు అని సర్ది చెప్పింది.
అయితే ఆ తరువాత ఆమె తన భర్త సంపాదన కూడా తీసుకునేది. ఆమె వేతనం సరిపోవడం లేదని అందుకే భర్త సంపాదన కూడా కావాలని అడిగేది. భర్త ఇవ్వకపోవడంతో గొడవలు చేసేది. ఆమె ఖర్చులు భరించలేని భర్త చివరికి ఆ డబ్బు ఏం చేస్తోందో తెలసుకోవడానికి ఒక ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి చేత ఒక జూమ్ వీడియో కాల్ చేయించాడు. ఆమెకు ఎక్కువ వేతనం ఇస్తామని నకిలీ ఉద్యోగ ఇంటర్‌వ్యూ చేయించాడు. అందులో ఆమె వివాహం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ ఇంటర్‌వ్యూలో ఆమె తాను రెండు వివాహాలు చేసుకున్నట్లు అంగీకరించింది. అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఇదంతా విన్న ఆ భర్త షాక్ కు గురయ్యాడు. ఆమె మాటల్లో నిజమెంతో తెలుసుకోవడానికి ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేశాడు.
తన భార్య ఆధార్ కార్డ్ తో ఆమె నిజంగానే రెండు వివాహాలు చేసుకున్నదా? అనే వివరాల కోసం ఆర్టీఐ ఫైల్ చేయగా.. అందులో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె తన పేరు మార్చుకొనేందుకు అఫిడవిట్ ఫైల్ చేసిందని.. ఆ తరువాత మరో పేరుతో 2023లో రెండో వివాహం చేసుకుందని తేలింది. ఆమె రెండో భర్త మరెవరో కాదు.. ఆమె ప్రియుడే. ఈ ఆధారాలతో తన భార్య తనను మోసం చేసిందని మంగళూరు కోర్టులో విడాకుల కోసం 2024 సంవత్సరంలో కేసు వేశాడు.
Also Read: ముస్లింలు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవచ్చు కానీ.. కోర్టు సంచలన తీర్పు
అయితే అతని భార్య తెలివిగా మొదటి భర్త తనను కట్నం కోసం వేధించేవాడని, బలవంతంగా అబార్షన్ చేశాడని, కొట్టేవాడని గృహ హింస కేసు పెట్టింది. పైగా విడాకులు ఇవ్వాలంటే రూ.3 కోట్లు భరణం చెల్లించి.. ప్రతి నెలా రూ.60 వేల ఖర్చుల కోసం ఇప్పించాలని కోర్టులో వాదించింది. కానీ కోర్టు ఇరువైపులా వాదనలు విని ఆమెకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. కేవలం కోర్టు ఖర్చుల కోసం రూ.30,000 చెల్లించాలని చెబుతూ ఆ యువకుడికి విడాకులు మంజూరు చేస్తూ ఏప్రిల్ 25న తీర్పు వెలువరించింది.