Maoist Hidma : మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ “హిడ్మా”ను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఒడిశా, కోరాపుట్‌లో హిడ్మాను సజీవంగా పట్టుకున్నారు. అతని నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, IED స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆయనతో పాటు 26 మంది మావోయిస్టులు మరణించారు. ఇక అబూజ్‌మడ్‌లో మావోయిస్టులు లేరని కేంద్ర బలగాలు ప్రకటించాయి. అయితే, మోస్ట్ వాంటెడ్ హిడ్మా మాత్రం ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్నాడు. హిడ్మా టార్గెట్‌గానే కర్రెగుట్టల్లో ఇటీవల పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. రోజుల తరబడి గుట్టల్లో గాలించారు. 30 మందికి పైగా మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. కానీ, కర్రెగుట్టల నుంచి కూడా హిడ్మా తప్పించుకున్నాడు. కట్ చేస్తే…
లేటెస్ట్‌గా, ఒడిశా పోలీసులు ACM Kunjam Hidma ను అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా.. కుంజం హిడ్మా ఒకరేనా కాదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ హిడ్మా, ఈ హిడ్మా ఒక్కరే అయితే.. అడవుల్లో అన్నలు దాదాపు క్లోజ్ అన్నట్టే.
హిడ్మా తలపై ఇప్పటికే రూ.4 లక్షల బహుమతి ఉండగా.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అతన్ని పట్టుకున్నందుకు రూ.8 లక్షల బహుమతి ప్రకటించింది. అరెస్ట్ సమయంలో హిడ్మా నుంచి AK-47 రైఫిల్, 35 లైవ్ రౌండ్లు, ఒక మ్యాగజైన్, 27 డిటోనేటర్లు, 90 వైర్-ఫ్రీ డిటోనేటర్లు, 2 కిలోల గన్‌పౌడర్, 2 స్టీల్ టిఫిన్ బాక్స్‌లు, 2 రేడియోలు, 2 ఇయర్‌ఫోన్‌లు, ఒక వాకీ-టాకీ, 2 కత్తులు, 4 టార్చిలైట్లు, మావోయిస్టు సాహిత్యం, మందులు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.