NCB – Secret Meth Lab : దేశ రాజధాని దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంత పరిధిలో నిషేధిత ప్రమాదకర డ్రగ్ మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌ను నార్కోక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు. దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులతో కలిసి రైడ్ చేసిన ఎన్ సీబీ అధికారులకు.. విస్తుపోయే అంశాలు ఎదురయ్యాయి. ఈ నిషేధిత డ్రగ్ తయారీ వెనుక ఏకంగా తీహాడ్ జైలు వార్డెన్ ఉన్నట్లు గుర్తించారు. దిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తతో చేతులు కలిపిన తీహార్ జైలు వార్డెన్.. చట్టవిరుద్ధంగా ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారని విచారణలో తేలింది.
ఈ ల్యాబ్ ద్వారా మెథాంఫేటమిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ ను తయారు చేసి.. దేశీయంగా వినియోగిస్తుండడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. అక్టోబర్ 25న దిల్లీ రాజధాని ప్రాంతంలోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలోని కసానా పారిశ్రామిక వాడలో సోదాలు నిర్వహించిన ఎన్ సీబీ అధికారులు.. లిక్విడ్, సాలిడ్ రూపాల్లో 95 కిలోల మెథాంఫేటమిన్ డ్రగ్ ను గుర్తించినట్లు ఎన్‌సీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ వ్యవహారంలో దొరికిన వ్యాపారవేత్త.. గతంలో ఎన్‌డీపీఎస్ కేసులో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించింది. అక్కడే జైలు వార్డెన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని జైలు వార్డెన్ ను ఈ మత్తు మందు తయారీలో దించాడు. ఈ డ్రగ్ ల్యాబ్ లో పనిచేసేందుకు ముంబైకి చెందిన ఒక కెమికల్ సైంటిస్ట్ ను నియమించుకోగా, డ్రగ్ నాణ్యతను దిల్లీలోనే ఉండే మెక్సికన్ ముఠ సభ్యుడు ఒకరు చూసుకునే వారు. ఈ కేసులో ఇప్పటికే.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. వీరికి స్థానిక మెజిస్ట్రేట్ 3 రోజుల పోలీసు కస్టడీ విధించినట్లు ఎన్‌సీబీ ప్రకటనలో తెలిపింది.
మెథాంఫెటమైన్ తయారీకి అవసరమైన రసాయనాలను వివిధ కంపెనీల నుంచి సేకరించిన నిందితులు.. ఈ ల్యాబ్ కేంద్రంగా అసిటోన్, సోడియం హైడ్రాక్సైడ్, మిథిలిన్ క్లోరైడ్, ప్రీమియం గ్రేడ్ ఇథనాల్, టోలున్, రెడ్ ఫాస్పరస్, ఇథైల్ అసిటేట్ వంటి రసాయనాలను తయారు చేశారు. ఈ డ్రగ్స్ తయారీకి కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కేటుగాళ్లు.. దిల్లీలోని ఎన్‌సీఆర్ పరిధిలోని పారిశ్రామిక వాడను సరైన ప్రాంతంగా గుర్తించి.. ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అయితే.. రసాయనాల తరలింపు సులువుగా ఉండడంతో పాటు పోలీసులు, ఇతరులకు అనుమానం రాదని భావించినట్లు చెబుతున్నారు. అలాగే.. ఈ డ్రగ్స్ తయారు చేసేటప్పుడు వెలువడే ఘాటైన రసాయనిక వాయువులు ఈ ప్రాంతంలో అయితే గుర్తించడం కష్టమని నిందితులు స్కెట్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ప్రస్తుతానికి దిల్లీ ఎన్ సీఆర పరిధిలో ల్యాబ్ ను గుర్తించినా.. ఈ డ్రగ్ తయారీ, సరఫరా ముఠా లింకులు చాలా వరకు విస్తరించి ఉన్నాయని పోలీసులు, ఎన్ సీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకే.. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం సైతం దర్యాప్తులో పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణా ద్వారా నిందితులు సంపాదించిన ఆస్తులు, వారి ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ లింకేజీలు, ఆర్థిక మూలాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లు ఎన్‌సీబీ తెలిపింది.
Also Read :సైనికులను కాపాడి.. తన ప్రాణం విడిచింది.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ డాగ్ ఫాంటమ్ మరణం
ఈ ఏడాది ఎన్ సీబీ (NCB) బృందాలు గుజరాత్‌లోని గాంధీనగర్, అమ్రేలి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, సిరోహి, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐదు ప్రదేశాలలో ఇటువంటి రహస్య ల్యాబ్‌లను గుర్తించాయి. ఈ నెల ప్రారంభంలో.. భోపాల్‌లోని బగ్రోడా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గుజరాత్ ATS సంయుక్త ఆపరేషన్‌లోనూ ఇలాంటి ల్యాబ్ నే కనుక్కున్నారు. ఇక్కడ ఏకంగా 907 కిలోల లిక్విడ్, సాలిడ్ రూపాల్లో మెఫెడ్రోన్, 7,000 కిలోల వివిధ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.