Digital camdom: కండోమ్ ఎందుకు ఉపయోగిస్తారు? పిల్లలు పుట్టకుండా అని ప్రతి ఒక్కరు చెప్తారు. గతంలో చైనా, భారత్ లాంటి దేశాల్లో జనాభా విపరీతంగా పెరగడంతో ప్రభుత్వాలు కండోమ్స్ వినియోగాన్ని విపరీతంగా ప్రోత్సహించాయి. ఎలా ఉపయోగించాలి అనే విషయంపై గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి. కాసేపు ఫిజికల్ కండోమ్ గురించి పక్కన పెడితే, ప్రస్తుతం డిజిటల్ కండోమ్ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ కండోమ్ ఏంటి? దాన్ని ఎలా వాడుతారు? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతాయి.
ఇంతకీ ‘డిజిటల్ కండోమ్’ అంటే ఏంటి?
ఏకాంతంగా గడపాలి అనుకునే వారి కోసం జర్మనీకి చెందిన సెక్సువల్ హెల్త్ బ్రాండ్ బిల్లీబాయ్ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు ‘కామ్ డోమ్’. దీనిని సదరు కంపెనీ ‘డిజిటల్ కండోమ్’గా పరిచయం చేసింది. ఇది ఓ సైబర్ సెక్యూరిటీ యాప్. ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీయకుండా, అక్కడి ఆడియో రికార్డు చేయకుండా ఈ యాప్ నిరోధిస్తుంది. వాస్తవానికి ఈ రోజుల్లో చాలా మంది రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి బెదిరింపులకు తావు లేకుండా డిజిటల్ కండోమ్ ను తీర్చిదిద్దింది బిల్లీబాయ్ కంపెనీ. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే ప్రైవేట్ మూమెంట్స్ సందర్భంగా కెమెరాలు పని చేయకుండా చేస్తుంది.
‘డిజిటల్ కండోమ్’ ఎలా పనిచేస్తుంది?
స్త్రీ, పురుషులు ఏకాంత సమయంలో స్మార్ట్ ఫోన్ లోని రహస్య కెమెరాలు పని చేయకుండా ఈ డిజిటల్ కండోమ్ యాప్ కంట్రోల్ చేస్తుంది. బ్లూ టూత్ ద్వారా పని చేసే ఈ యాప్ సమీపంలోని కెమెరాలు, మైక్రో ఫోన్లు పని చేయకుండా అడ్డుకుంటుంది. ఏకాంత సమయంలో ఈ యాప్ ను ఓపెన్ చేసి పక్కన పెడితే, ఎలాంటి భయం లేకుండా ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించవచ్చని బిల్లీ బాయ్ సంస్థ వెల్లడించింది.
ఒకవేళ సీక్రెట్ గా వీడియో తీసేందుకు ప్రయత్నిస్తే..
డిజిటల్ కండోమ్ ఆన్ లో ఉన్నప్పటికీ ఎవరైనా వీడియోలు, ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తే, యాప్ అలర్ట్ అవుతుంది. వెంటనే అలారం మోగుతుంది. యూజర్లను అలర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ యాప్ ఒకేసారి చుట్టుపక్కల ఉన్న అన్ని డివైజ్ లలోని కెమెరాలు, మైకులను బ్లాక్ చేస్తుంది. చాలా మంది వినియోగదారులు డిజిటల్ కండోమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టెక్నాలజీ దుర్వినియోగం అవుతున్న వేళ ఇలాంటి యాప్స్ అవసరం చాలా ఉందంటున్నారు.
త్వరలో ఐవోఎస్ వెర్షన్ విడుదల
ప్రస్తుతం ఈ యాప్ ను బిల్లీ బాయ్ సంస్థ ఆండ్రాయిడ్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోదారుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఐవోఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ వెర్షన్ ప్రస్తుతం 30 దేశాల్లో వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్ కు మంచి ఆదరణ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. త్వరలోనే ఐవోఎస్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
Read Also: మలంతో మనీ.. ఈ కొరియన్ ప్రొఫెసర్ ఐడియాకు హ్యాట్సాఫ్.. ఇక టాయిలెట్‌లోనే ఎనర్జీ పుట్టించవచ్చు!