JN1 Variant: కొవిడ్ సబ్ వేరియంట్ JN1 కారణంగా.. భారత్ లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండ్రోజులు 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 48 గంటల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఏడుగురు కరోనాతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి, నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ బుధవారం రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు. కొవిడ్ పై ఎవరూ రాజకీయం చేయొద్దని కోరారు. ప్రతి మూడు నెలలకొకసారి ఆస్పత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.
కొవిడ్ వ్యాప్తిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. అప్రమత్తంగా మాత్రం ఉండాలన్నారు. మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై ప్రజలకు అవగాహన కలిగించడంపై సిద్ధంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, శీతాకాలంలో వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. JN1 వేరియంట్ పై భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని, దానిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు JN1 సహా ఇతర సబ్ వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని తెలిపింది.