ద్రవిణ పాలిటిక్స్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న తమిళనాడు రాజకీయాల్లో స్థానిక పార్టీలకే ప్రాధాన్యం ఉంది. దీనికి భిన్నంగా, 40 ఏళ్లలో బీజేపీ నుండీ ఇటీవలే ఓ నాయకుడు బలమైన నాయకత్వంతో ముందుకొచ్చారు. కె.అన్నామలై దూకుడును చూసి తమిళ రాజకీయాలు రూపుమారుతుందని అనుకున్నారు. గతేడాది, ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంఘటనను కేంద్ర స్థాయిలో రచ్చ రచ్చ కూడా చేశారు. సనాతన ధర్మాన్ని కరోనా, మలేరియా, డెంగ్యూ లతో పోల్చడంతో ఉదయనిధి విమర్శలపై తమిళనాడులో పొలిటికల్ వార్ జరిగింది. ఇక, సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని.. దీన్నీ సమూలంగా నాశనం చేయాలంటూ చెప్పిన ఉదయనిధి వ్యాఖ్యలు కోర్టులకు కూడా ఎక్కాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కామెంట్స్ చేసిన స్టాలిన్.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వనించకుండా బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సనాతన ధర్మంలోని వివక్షకు ప్రతిరూపం అని కూడా అన్నారు.
ఉదయనిధి సనాతన ధర్మం వివాదంపై నాడు ప్రధానీ మోడీ కూడా స్పందించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సరైన విధంగా స్పందించాలని మంత్రులకు కూడా దిశా నిర్దేశం చేశారు. ఇలా దేశవ్యాప్తంగా రేగిన దుమారంతో హిందూ సంఘాల నేతలు ఉదయనిధిని టార్గెట్ చేశారు. ఆయన్ను చెప్పుతో కొడితే పది లక్షలు ఇస్తామని ఒకరంటే, ఆయన తల తీసుకొస్తే పది కోట్లు ఇస్తానని ఒకరన్నారు. అయితే, మీరు ఏమనుకున్నా, నా మాటలు వెనక్కు తీసుకునేదే లేదనీ, చట్టపరంగానైనా సమర్థించుకుంటానని అన్నారు ఉదయనిధి స్టాలిన్. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కొనసాగిస్తామని అన్నారు. అలాగే, తాను చేసిన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారని.. తాను కుల బేధాలు నశించాలని అన్నట్లు పేర్కొన్నారు. కేవలం హిందుత్వలోనే కాకుండా అన్ని మతాల్లో కూడా ఈ భేదాలు పోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా, బీజేపీ చేసిన రాజకీయ రచ్చ మాత్రం తమిళనాడులో పెద్దగా పండలేదు.
Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర “రాజ్యమాతగా” ఆవు
ఇక, తమిళ సూపర్ స్టార్ విజయ్ 2026లో తన ఎన్నికల అరంగేట్రం చేయనున్న తరుణంలో.. ఉదయనిధి స్టాలిన్ హోదాను మార్చడం అతని స్థాయిని పెంచుతుందనండంలో సందేహం లేదు. ఈ పరిణామం డిఎంకె రాజకీయ యంత్రాంగానికి కూడా మద్దతునిస్తుంది. అతన్ని బలీయమైన నెక్స్ట్ జనరేషన్ రాజకీయవేత్తగా చేస్తుంది. సంప్రదాయ ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకు పోటీగా దళపతి విజయ్ టీవీకే పార్టీ ప్రారంభించిన కొద్ది కాలానికే ఈ పరిణామం చోటుచేసుకుంది. యువ ఓటర్లలో విజయ్‌కున్న పాపులారిటీకి విరుగుడు కోసం ఉదయనిధిని ఉన్నత లీడర్‌గా చూపించడం డీఎంకేకు తప్పనిసరి అయ్యింది. దీని కోసం, సీఎం స్టాలిన్ చాలా ఎత్తుగడలు అమలు చేశారు. దీంతో పార్టీలో అన్నివర్గాల నుంచి ఉదయనిధికి మద్దతు లభించినట్లైంది. ఇక, రాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉదయనిధి గ్రాఫ్ పెంచడం.. దళపతి విజయ్‌కు గట్టీ పోటీగా మార్చడం ఆవశ్యకమయ్యింది.
నిజానికి, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి అన్ని స్థానాల్లో విజయం సాధించి అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఉదయనిధికి ఈ అవకాశం వచ్చింది. అలాగే, డిఎంకె సీనియర్ నాయకులైన టిఆర్ బాలు, దురై మురుగన్‌ల కుమారులు రాష్ట్ర ప్రభుత్వంలోనూ, కేంద్రంలోనూ అధికార పదవుల్లో ఉండడంతో ఎవరూ తిరుగుబాటు బావుటా ఎగురవేసే పరిస్థితి లేదు. ఇక, స్టాలిన్ అన్న అళగిరి నుండి కానీ, కనిమొళి నుండి గానీ వచ్చే ఇబ్బందులు కూడా కుటుంబంలోనే సద్దుమణిగాయి. డిఎంకె పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా స్టాలిన్ నిర్ణయం అనివార్యమయ్యింది. నిజానికి, జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏం జరుగుతుందో ముందే ఊహించిన స్టాలిన్ ఈ ఎత్తుగడను కూడా ముందే నిర్దేశించుకున్నారన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఎడప్పాడి పళనిస్వామి తన పదవీ కాలాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, జయలలిత హయాంలో అన్నాడీఎంకేను నియంత్రించిన ముగ్గురు నేతలు – వీకే శశికళ, ఓ పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్‌ల పతనం, వాగ్వివాదాలతో పార్టీ దెబ్బతినడం కూడా తమిళ రాజకీయ నేతలకు తెలుసు. అందుకే, స్టాలిన్ తన వారసుడికి కిరీటం పెట్టాలనుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా అంతా సమర్థించారు.
నిజానికి, లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, సీఎం స్టాలిన్.. తన రాజకీయ ప్రత్యర్థులకు వారసత్వ పాలన, బంధుప్రీతిని ఛాన్స్‌గా ఇవ్వాలనుకోలేదు. అయితే, ఇప్పుడు అవసరంగా మారిన తరుణంలో ఈ స్టెప్ తీసుకున్నట్లు అర్థమవుతుంది. 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉదయనిధి పార్టీ తరఫున స్టార్ క్యాంపైనర్‌గా మారారు. అతని ఎన్నికల ప్రసంగాలు కాకలు తీరిన రాజకీయ నాయకుల్లా కాకుండా, సాధారణ పక్కింటి అబ్బాయిగా ఓటర్లను ఆకర్షించాడు. ప్రజల్లోకి దూసుకెళ్లి వాళ్లలో ఒకడిగా ఉండే శైలిని అలవర్చుకున్నాడు. ఈ శైలి, 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి క్యాంపెయినింగ్‌లో స్టార్ డమ్‌ను తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా, 2026 నాటికి ఉదయనిధి డీఎంకే పార్టీలో సరికొత్త ఉదయానికి తెరలేపడానికి సిద్దమవుతాడని, సీఎం స్టాలిన్ విశ్వాసంతో ఉన్నారు. ఇక, రాబోయే కాలంలో ఉదయనిధి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో భవిష్యత్ నిర్ణయిస్తుంది.