Major Changes in VIP Security: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖుల భద్రతపై దృష్టి సారించింది. ఆ దిశగా కసరత్తు కూడా మొదలు పెట్టేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు వీఐపీలకు వ్యక్తిగత భద్రత విధుల్లో ఉన్న ఎన్ఎస్‌జీ కమెండోలతోపాటు ఐటీబీపీ సిబ్బందిని ఉపసంహరణకు రంగం సిద్ధమైంది. జడ్ ప్లస్ కేటగిరిలో తొమ్మిది విభాగాల్లో ఉన్నవారి రక్షణ బాధ్యతలను ఇకపై సీఆర్పీపీఎఫ్, సీఐఎస్ఎఫ్, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులకు వీఐపీల బాధ్యతలను అప్పగించనుంది.
ప్రస్తుతం దేశంలో ప్రముఖుల భద్రతలో దాదాపు 450 మంది బ్లాక్ క్యాట్ కమెండోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వారిని ఆ విధుల నుంచి తప్పించి దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం బ్లాక్ క్యాట్ కమెండోలను వ్యక్తిగతంగా రాజకీయ నేతలు, ఎంపీలు, మాజీ మంత్రులు, రిటైర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు వినియోగిస్తున్నారు.
యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్, ఎల్‌కె అద్వానీ, కేంద్రమంత్రి సోనోవాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, గులామ్ నబీ ఆజాద్, ఫారూఖ్ అబ్దుల్లా, చంద్రబాబు నాయుడులకు బ్లాక్ క్యాట్ కమోండోలను భద్రత కల్పించారు. ఇక ఐటీబీపీ భద్రతను బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు మరికొందరు ఉన్నారు.
Also Read: ఆర్ఎస్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు, అతి విశ్వాసమే బీజేపీ కొంప.. కేవలం సోషల్ మీడియానే..
ఉగ్రదాడులు, విపత్తుల సమయాల్లో వీరిని ఉపయోగించుకునేందుకు 1984లో ఎన్ఎస్‌జీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్లాక్ క్యాట్ కమెండోల వ్యవస్థ చివరకు వీఐపీ భద్రతగా మారింది. పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం, వీఐపీల భద్రత నుంచి ఎన్ఎస్‌జీ తప్పించాలని భావించింది. ఇందుకు 2012లో ప్రణాళికలు రూపొందించారు.
దేశంలో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యక్తిగతంగా దాదాపు 200 మంది వినియోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గాంధీ ఫ్యామిలీతోపాటు మరికొందరు ఉన్నారు. ఇక సీఐఎస్ఎఫ్ అయితే ఎన్ఎస్‌ఏ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తోపాటు మరికొందరు ఉన్నారు.