Modi To Morbi Hospital : మోర్బీ దుర్ఘటన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు ప్రధాని మోదీ పారమర్శంచనున్నారు. ప్రధాని రానుండడంతో మోర్బీ ఆసుపత్రి అధికారులు రాత్రికి రాత్రి ఆసుపత్రికి మరమ్మత్తులు చేయడం, కొంత హంగులు అద్దడం మొదలుపెట్టారు. ప్రధాని ఈ రోజు దుర్ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించడంతో పాటు.. ప్రాణాలతో బయటపడ్డ బాధితులను కలుసుకోనున్నారు.
ఈ రోజు ప్రధాని రానున్నారని.. నిన్న రాత్రి మోర్బీ ఆస్పత్రిలో హడావుడి సృష్టించారు. ఆసుపత్రిని శుభ్రం చేసి.. గోడలకు, పైకప్పులకు పెయింట్ వేశారు. కూలర్స్, ఫ్యాన్స్, టాయిలెట్స్ ఇలా అన్నింటినీ మార్చివేసి.. కొత్తగా ఏర్పాటు చేశారు. ఒక రాత్రికి రాత్రే మోర్బీ ఆసుపత్రి రూపురేఖలు మార్చేశారు మోర్బీ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు.
మోర్బీ ఆసుపత్రిలోని ఈ హడావుడి దృష్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని ఫోటో షూట్ కోసం బీజేపీ చేసే ఈవెంట్ మ్యానేజ్మెంట్ ఇది అని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు 140 మందికి పైగా చనిపోయి దేశం, ప్రపంచం దిగ్భ్రాంతిలో ఉంటే.. బీజేపీ నాయకులకు ఫోటో షూట్ పనిలో బిజీగా ఉన్నారని కొందరు సోషల్ మీడియలో విరుచుకుపడుతున్నారు.
గుజరాత్ రాష్ట్రాన్ని 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ.. సరిగ్గా పనిచేసి ఉంటే మోర్బీ ఆసుపత్రి ఇంత అద్వాన స్థితిలో ఎందుకు ఉంటుంది అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి. దీంతో ఇదే అదనుగా.. గుజరాత్‌లో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడుతన్నాయి.