Etela Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడి జరిగింది. మునుగోడు ప్రచారంలో ఉన్న ఆయన్ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పలివెలలో ఇరువర్గాలు ఎదురుపడటంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈటల కాన్వాయ్ పై దాడి చేయగా.. ఆయన కారు ధ్వంసమైంది.
బీజేపీ శ్రేణులు సైతం రివర్స్ అటాక్ చేశారు. పెద్ద సంఖ్యలో ఇరు పార్టీ కార్యకర్తలు జెండా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. రాళ్లతో దాడి చేసుకున్నారు. పలివెలలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
బీజేపీ కార్యకర్తల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ జగదీష్ తదితరులకు గాయాలయ్యాయి. రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. బీజేపీ భౌతిక దాడులకు పాల్పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించగా.. తన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగడంపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు.
పలివెల దాడి ఘటనపై ఈసీ సీరియస్ గా స్పందించింది. వెంటనే అక్కడికి అదనపు బలగాలు తరలించాలని ఆదేశించింది.