Big Stories

Madhya Pradesh New CM : మధ్యప్రదేశ్ ప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్‌ యాదవ్‌.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Madhya Pradesh New CM : మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాషాయ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌ ను ఎంపిక చేసింది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సోమవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -

బీజేపీ అధిష్ఠాన పరిశీలకులు హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ , కె.లక్ష్మణ్‌, ఆశా లక్రా సమక్షంలో బీజేపీ శాసససభా పక్ష నేత ఎన్నిక జరిగింది. కొత్తగా ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేలు భోపాల్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభా పక్షనేతగా మోహన్‌ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తున్నారు. రేవా ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీశ్‌ దేవరాను ఉపముఖ్యమంత్రి పదవులకు ఎంపిక చేశారు.

- Advertisement -

58 ఏళ్ల మోహన్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో మోహన్‌ యాదవ్‌కు మంచి అనుబంధం ఉంది. రాజకీయ ఎంట్రీ ఇచ్చి 2013లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2018లోనూ మరోసారి విజయం సాధించారు. 2020లో సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా మోహన్ యాదవ్ కు అవకాశం దక్కింది. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి విజయభేరి మోగించారు. వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించారు.

మధ్యప్రదేశ్ లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించగానే సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగింది. అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సహా కొంతమంది ఎంపీలు, కేంద్రమంత్రులు ఉన్నారు. కానీ ఆ పేర్లను పక్కనబెట్టి మోహన్ యాదవ్ కు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇవ్వడం సంచలనంగా మారింది.

కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నుకోవడం విశేషం. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలున్నాయి. అందులో బీజేపీ 163 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News