BigTV English

National Bird Day : ప్రమాదం అంచున పక్షి జాతులు..

National Bird Day : ప్రమాదం అంచున పక్షి జాతులు..

National Bird Day : ఒకప్పుడు వేకువ జామున నిద్ర లేవగానే.. పక్షుల కువకువలు వినిపించేవి. రామచిలుకలు, పిచ్చుకలు, పావురాలు తినేందుకు ఇంటి దర్వాజా వద్ద పంట పొలాల నుంచి తెచ్చిన జొన్న, సజ్జ కంకులు వేలాడదీసే వారు. కనుచూపు మేరలో ఎక్కడ పక్షి గూడు కనిపించినా దాని జోలికి పోయేవారు కాదు. ఎండాకాలం వస్తే.. ఇంటి వసారాల్లో పక్షుల కోసం రోజూ చల్లటి కుండ నీళ్లు పోసి మట్టి పాత్రల్లో పెట్టి ఉంచేవారు. గుడి గోపురం మీది చిలుకలను చూపించి మారాం చేస్తున్న పిల్లలను పెద్దలు మాయచేసేవారు. కానీ.. పల్లెటూళ్లలోనే ఇప్పుడు ఈ దృశ్యాలేవీ కనిపించటం లేదు. పక్షితో మన అనుబంధం.. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలకే పరిమితం. మానవ మనుగడకు అత్యంత అవసరమైన పక్షి జాతులు వేగంగా అంతరించి పోతున్న వేళ.. వాటి అవసరాన్ని, వాటి ఉనికిని తిరిగి నిలబెట్టాల్సిన అవసరాన్ని అందరికీ గుర్తుచేయాలనే ఉద్దేశంతోనే మనం ఏటా జనవరి 5న జాతీయ పక్షి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.


ప్రపంచ వ్యాప్తంగా 10,906 జాతుల పక్షులుండగా, అందులో 1353 జాతులు భారతదేశంలో కనిపిస్తాయని జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చెబుతోంది. ఈ లెక్కన ప్రపంచంలోని పక్షి జాతుల్లో 12.4 శాతం జాతులు భారత్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. మరే దేశంలోనూ కనిపించని 78 రకాల జాతుల పక్షులు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. మనదేశంలోని 28 రకాల పక్షి జాతులు పశ్చిమ కనుమల్లో, మరో 25 జాతులు అండమాన్‌ నికోబార్‌ ప్రాంతాల్లో, 4 అరుదైన జాతులు తూర్పున హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి.

తాజా అధ్యయనాల ప్రకారం, ప్రపంచంలోని పక్షుల జాతుల మొత్తం జనాభాలో, 48% జనాభా వేగంగా క్షీణిస్తోంది. మరో 39% పక్షుల జాతుల జనాభా స్థిరంగా ఉంది. కేవలం.. ఆరు జాతుల పక్షుల సంఖ్య మాత్రమే పెరుగుతోంది. మరో 7% పక్షులకు సంబంధించిన సమాచారమే అందుబాటులో లేదు. ఇప్పటివరకు పరిశోధకులు 11 వేల పక్షి జాతులపై అధ్యయనం చేశారు. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న అడవులు, మిరుమిట్లు గొలిపే కాంతులు, ఆహార కొరత, రేడియేషన్ ప్రభావాలు పక్షుల ప్రాణాలను బలిగొంటున్నాయి.


ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) రెడ్‌ లిస్ట్‌‌లో ఐత్య బేరీ, అటవీ గుడ్ల గూబ, గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్, బెంగాల్‌ ఫ్లోరికన్, సైబీరియన్‌ క్రేన్, స్నేహశీల లాఫ్టింగ్, వైట్‌ బ్యాక్ట్‌ రాబందు, రెడ్‌హెడ్‌ రాబందు, సన్న రాబందు, రాబందు, పింక్‌హెడ్‌ బాతు, హిమాలయ పిట్టను పూర్తిగా కనుమరుగవుతున్న జాబితాలో చేర్చారు. మొత్తంగా మన దేశంలో మాత్రమే కనిపించే 78 రకాల పక్షి జాతుల్లో 25 జాతుల మనుగడ ప్రమాదంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక.. ఇక్కడికొచ్చే విదేశీ వలస పక్షుల్లో 29 పక్షి జాతులు ప్రమాదం అంచున ఉన్నట్టు, మరో 15 జాతుల పక్షులు దాదాపు అంతరించే దశలో ఉన్నట్లు తేలింది.

ఆహారపు గొలుసులో జీవులన్నీ భాగమే. వీటిలో ఒక్క జీవి అంతిరించినా.. మొత్తం ఆహారపు గొలుసు వ్యవస్థ దెబ్బతిని, క్రమంగా అంతరించిపోతుంది. గతంలో చనిపోయిన పశువులను రాబందులు.. పీక్కు తినేవి. పశువుల వైద్యంలో భాగంగా వాడే ఇంజెక్షన్ల ప్రభావం రాబందుల మీద పడి.. వాటి సంతానోత్పత్తి తగ్గిపోయి.. ఇవి అంతరించిపోయాయి. ఇక..పెద్ద పెద్ద భవనాల అద్దాల గోడల వెనుక వెలిగే దీపాలను ఢీకొని అనేక పక్షులు చనిపోతున్నాయి. ఎరువులు, పురుగు మందుల వాడకం, అయస్కాంత తరంగాలు, కరెంటు తీగలు, అడవుల్లో చెట్లు నరకడం, ధ్వని తరంగాలు, వేటగాళ్లు, వాయు, నీటి, భూమి కాలుష్యం పక్షి జాతుల అంతానికి కారణంగా మారుతున్నాయి.

ఇక.. మన తెలుగు రాష్ట్రాల సంగతికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు, మహారాష్ట్రలోని మరో పక్షుల అభయారణ్యాల్లో ప్రమాదం అంచున ఉన్న బట్టమేక పక్షి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పంటలను ఆశించే కీటకాలను తిని, పంటను రక్షించే పక్షులు రైతులకు నేస్తాలు. పక్షుల మలం ద్వారా పడిన గింజలు.. అడవుల్లో కొత్త మొక్కలుగా మారతాయి. పువ్వుల మీద తిరుగుతూ పుప్పొడిని ఇతర పుష్పాలకు చేర్చి పండ్లుగా మార్చుతాయి. పక్షి మాయమైతే.. ఇవన్నీ ఆగిపోవటంతో బాటు భవిష్యత్తులో మనిషి మనుగడకూ ప్రమాదం రావొచ్చు. కనుక పక్షుల ఉనికిని నిలిపే చర్యలకు తక్షణం మనమంతా పూనుకుందాం.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×