Big Stories

New policy to control cyber crimes: సైబర్ నేరాలకు చెక్.. ఎవరు కాల్ చేసినా తెలిసేలా..

- Advertisement -

దేశంలో సైబర్ నేరాలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం… మొబైల్ ఫోన్ వినియోగదారులకు వరంగా మారనుంది. ఇకపై గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్త పడేలా… కొత్త టెలికాం విధానం అమల్లోకి రానుంది. అది పార్లమెంటులో ఆమోదం పొందడమే తరువాయి.

- Advertisement -

ప్రస్తుతం ట్రూ కాలర్‌ లాంటి యాప్‌లను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటేనే… మనకు ఎవరు ఫోన్ చేస్తున్నారనే వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అలాంటి యాప్‌ల అవసరం లేకుండా… తమకు ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్‌ ఫోన్‌ వినియోగ దారుడికి హక్కుగా చేస్తూ… కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం మొబైల్‌ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్లో మార్పులు చేయాలని కేంద్రం ఆదేశించబోతోంది.

దేశంలో ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ బెడద విపరీతంగా పెరిగిపోయింది. ఫేక్‌ ఐడీ కార్డులతో సిమ్‌ కార్డులు, OTT కనెక్షన్లు తీసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు… దర్జాగా మోసాలు చేస్తున్నారు. దాదాపు 90 శాతం సైబర్‌ నేరాలు… ఫేక్‌ ఐడీలతో తీసుకున్న అన్ నోన్ నెంబర్ల ద్వారానే జరుగుతున్నాయి. వాటిపై దర్యాప్తు జరపాలంటే పోలీసులు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈ సమస్య తీరేలా కేంద్రం కొత్త విధివిధానాలతో డ్రాఫ్ట్ రూపొందించి… పార్లమెంటుకు సమర్పించింది. వచ్చే సమావేశాల్లో డ్రాఫ్ట్ ఆమోదం పొందే అవకాశం ఉంది.

నయా రూల్స్ అమల్లోకి వస్తే… టెలికాం కంపెనీలు తమ ఖాతాదారుల పూర్తి వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డులను తనిఖీ చేసి… అవి నిజమైనవని నిర్ధారించుకున్న తర్వాతే సిమ్‌ కార్డ్, వోటీటీ కనెక్షన్‌ ఇవ్వాలి. లేదా అవి ఇచ్చిన వారం లోపు నిర్ధారించుకోవాలి. గుర్తింపుకార్డులు నకిలీవని తేలితే వెంటనే సేవలు నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఫేక్‌ ఐడీ కార్డుతో కనెక్షన్‌ తీసుకున్నవారిపై పోలీసులు కేసు నమోదు చేసి… రూ.50 వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ పడేలా చర్యలు తీసుకుంటారు. ఫేక్ ఐడీలతో సర్వీసు కొనసాగిస్తే… దానికి టెలికాం కంపెనీయే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తానికి… అటు కాల్ రాగానే ఎవరు చేశారో తెలిసేలా… ఇటు సైబర్ నేరాలకు చెక్ పడేలా… కొత్త విధానం త్వరలో అమల్లోకి రాబోతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News