KEJRIWAL: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగగానే రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో గతంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్యే పోరు నడిచింది. బీజేపీ 24 ఏళ్ల పాలనకు చరమగీతం పాడతామంటూ ఈ సారి ఆప్ గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పంజాబ్ లో విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆప్ ఇప్పుడు ప్రధాని మోదీ ఇలాకాపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాలకు ఉపశమనం కల్పిస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్‌ను జైలు నుంచి విడుదల చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని తెలిపారు.
ఆప్ నుంచి బయటకు వస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్‌ను మనీశ్ సిసోడియా తిరస్కరించిన తర్వాత బీజేపీ నేతలు తనను సంప్రదించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే.. సత్యేంద్ర జైన్, సిసోడియాలపై కేసులు ఎత్తివేస్తామని ఆఫర్ చేశారని ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.