Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియ ఉరి శిక్ష కేసులో ఉత్కంఠ మళ్లీ మొదటికి వచ్చింది. బుధవారం అమలు కావాల్సిన మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది యెమెన్ ప్రభుత్వం. ప్రియకు కాస్త ఊరట లభించింది. మృతుడి బంధువులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కచ్చితంగా శిక్షపడాల్సిందేనని అంటోంది. దీంతో రేపటిరోజు ఏం జరుగుతోందన్న ఉత్కంఠ మొదలైంది.
మృతుడు తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దేల్‌ఫట్టా ఓ ప్రకటన చేశాడు. నేరానికి క్షమాపణ ఉండదని తేల్చాశాడు. నిమిష ప్రియకు శిక్ష పడాల్సిందేనన్నాడు. బ్లడ్ మనీకి ఏ మాత్రం అంగీకరించబోమ న్నది అతడి వ్యాఖ్యల సారాంశం. ప్రియ శిక్ష అమలు వాయిదాపై ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్డాడు.
సయోధ్య కోసం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కావన్నాడు. ఈ విషయంలో మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదన్నాడు. ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని ఏమాత్రం మార్చవని తేల్చేశాడు. వాయిదాను ఊహించలేదని చెబుతూనే డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమన్నాడు. మాకు కచ్చితంగా న్యాయం దక్కాల్సిందేనని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు.
ఇదే క్రమంలో మరో వ్యాఖ్య చేశాడు. దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దన్నాడు. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిన విషయాన్ని మంగళవారం భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. యెమెన్ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో ప్రతీ క్షణం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది.
ALSO READ: రాజస్థాన్ లో భారీ వర్షాలు.. 12 మంది మృతి
నిమిష-బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి మరింత సమయం ఇవ్వాలని కొన్ని రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్లు అంటే భారత్ కరెన్సీలో దాదాపు 8 కోట్ల రూపాయలు పైగానే ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకు బాధిత ఫ్యామిలీ అంగీకరిస్తే నిమిష మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.
బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ లోగా మృతుడి సోదరుడు పోస్టుతో నిమిష వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు నిమిష ప్రియ నర్సు ఉద్యోగం కోసం 2012లో యెమెన్ వెళ్లింది.
వివిధ ఆసుపత్రుల్లో పని చేసిన ఆమె సొంతంగా ఆసుపత్రి పెట్టింది. ఆ వ్యాపార భాగస్వామిగా తలాల్ అబ్దో మెహదీ చేరాడు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 2017లో అతడు హత్య గురయ్యాడు. ఈ కేసులో ప్రియను అక్కడి న్యాయస్థానం దోషిగా తేలింది. 2020 లో యెమెన్ కోర్టు నిమిషాకు మరణశిక్ష విధించింది.