Newborn Baby: అమ్మతనం కమ్మతనం అంటారు. ఆ అమ్మే తన అమ్మతనాన్ని మరిచి ఇలాంటి దురాగతానికి పాల్పడింది. ఓ యువతి బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ బిడ్డను భారంగా భావించి, బయటకు విసిరేసింది. ఆమెతో కలిసి ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ఆ చర్యకు తోడ్పడ్డాడు.
పుట్టిన క్షణాలకే ప్రాణం కోల్పోయిన ఆ శిశువు కథ విని ఎవరి హృదయమైనా కలవరపడాల్సిందే. సమాజం ఎంతగా మారిపోయింది? పరిస్థితులు ఒక తల్లిని ఇలా ప్రవర్తించేలా చేస్తాయా? ఎక్కడ నమ్మకం పోతుంది? ఎక్కడ ప్రేమ పోతుంది? ఇది కథ కాదు.. కడుపున పుట్టి క్షణాలకే శవమైన ఒక నిజం.
మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రసవించిన అనంతరం తమకున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగా నవజాత శిశువును బస్సు నుంచి బయటకు విసిరేశామని ఒక యువ దంపతులు పోలీసులకు చెప్పిన ఘటన అందరినీ కలిచివేసింది.
ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఆ విషాదం
ఈ ఘటన మంగళవారం ఉదయం 6:30 ప్రాంతంలో మహారాష్ట్రలోని పరభణి జిల్లా పాఠ్రి-సేలూ రోడ్ వద్ద చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడు బస్సు నుంచి ఒక చిన్న కట్టె విసిరివేయబడినట్టు గమనించి, అనుమానం వచ్చి దాన్ని పరిశీలించగా.. అందులో ఒక మగ శిశువు ఉండడం గమనించాడు. వెంటనే అతను 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
బస్సులో ప్రసవించిన మహిళ.. ఆపై శిశువుకు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం, 19 ఏళ్ల రితిక ధిరే అనే యువతి పుణే నుండి పరభణికి వస్తూ సంతోష్ ప్రయాగ్ ట్రావెల్స్‌కి చెందిన స్లీపర్ కోచ్ బస్సులో ప్రయాణిస్తోంది. ఆమెతో పాటు ఆల్తాఫ్ షేక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతను తాను ఆమె భర్తనని చెప్పాడు. ప్రయాణ సమయంలో రితికకు తీవ్రమైన ఒత్తిడి రావడంతో బస్సులోనే ప్రసవించింది.
శిశువును బస్సు విండో నుంచి బయటకు విసిరేశారట!
శిశువు పుట్టిన తర్వాత దంపతులు ఆ శిశువును ఒక వస్త్రంలో కట్టించి, విండో నుంచి బయటకు విసిరేశారని పోలీసులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ ఈ దృశ్యాన్ని గమనించి అనుమానం వ్యక్తం చేయగా.. ఆల్తాఫ్ మాత్రం వాంతి చేసిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడట. కానీ అప్పటికే అప్రమత్తమైన పౌరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వెంటనే బస్సును అడ్డగించారు.
Also Read: Tenali boating project: వెళ్తున్నారా తెనాలికి? స్కైవాక్ బ్రిడ్జ్, బోటింగ్ రైడ్ రెడీ!
వైద్యం కోసం ఆసుపత్రికి.. కేసు నమోదు
పోలీసులు ఇద్దరిని విచారించగా వారు తప్పు చేశామంటూ అంగీకరించారు. తమ వద్ద పెంపుడు కష్టాలు, ఆర్థిక పరిస్థితులు బాగోలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రితిక ధిరేను వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వీరిద్దరూ నిజంగా పెళ్లి అయిన దంపతులా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వారు ఎలాంటి పత్రాలు చూపించలేకపోయారు.
కేసు నమోదు
పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్ 94(3), (5) ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో పుట్టిన బిడ్డను రహస్యంగా పారవేయడం, జననం లెక్కలలో చూపకుండా చేయడం వంటి నేరాలపై చర్యలు ఉంటాయి. ప్రస్తుతం ఈ కేసుపై మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ ఘటన సామాజికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అప్పుడే బిడ్డకు జన్మనిచ్చి వెంటనే జీవితం నుంచి దూరం చేయడం ఎంతటి అవివేకం, అనాగరిక చర్య అనే దానిపై మానవ హక్కుల సంఘాలు స్పందించాయి.
సమాజంలో అనేకమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. కానీ, సమాజానికి, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యతను ఇలా శిశువును విసిరేసే చర్యగా మార్చడం ఎంత పాశవికమో గ్రహించాలని మేధావులు కోరుతున్నారు అవసరమైన శిశు సంరక్షణ కేంద్రాలు, మహిళల రక్షణ హెల్ప్‌లైన్ల సమాచారం ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత మనందరిదని వారు సూచిస్తున్నారు.