Pahalgam Security Lapse| జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడికి భద్రతా వైఫల్యం కూడా ఒక కారణమని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు చేశాయి. ఈ విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో కూడా ప్రస్తావించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందిస్తూ.. దాడి జరిగిన బైసరన్ లోయ ప్రాంతంలో పర్యాటకులను అనుమతించిన విషయం భద్రతా సిబ్బందికి తెలియదని.. ఈ సమాచారం స్థానిక అధికారులు అందజేయలేదని ప్రభుత్వం వెల్లడించినట్లు తెలుస్తోంది. పలు ఆంగ్ల మీడియా పత్రికలు ఈ విధంగా కథనాలు ప్రచురించాయి.
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ ఘటన వెనుక భద్రతా లోపాలు ఉన్నాయని, దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదని విపక్షాలు విమర్శించాయి. దాడి సమయంలో భద్రతా బలగాలు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎక్కడ ఉన్నారని పలువురు నాయకులు ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫున ఓ కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ‘‘సాధారణంగా జూన్ నెల నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే వరకు ఈ లోయకు పర్యాటకులను అనుమతించకుండా ఆంక్షలు విధిస్తారు. అయితే, ఈసారి స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బైసరన్ లోయకు పర్యాటకులను అనుమతించారు. అంతేకాకుండా, పహల్గాంలోని బైసారన్ లోయ ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో అక్కడికి చేరుకోవాలంటే 45 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రామాణిక విధానాలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అమలులో లేవు’’ అని వివరించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వేలాది మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు.. ప్రభుత్వానికి ఈ విషయం తెలియకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘బైసరన్ లోయను పర్యాటకుల కోసం తెరిచిన విషయం మహారాష్ట్రలోని ట్రావెల్ ఏజెన్సీలకు తెలిసినప్పుడు.. భద్రతా సిబ్బందికి మాత్రం ఎలా తెలియదు?’’ అని మరో ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
Also Read: పాకిస్తానీలందరూ ఇండియా వదిలి వెళ్లిపోవాలి.. మరి ఇండియాలో కాపురం పెట్టిన సీమా హైదర్ పరిస్థితేంటి..
పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ లోయను ‘మినీ స్విట్జర్లాండ్’ అని పిలుస్తారు. వేసవి కాలంలో ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ఆహ్లాదకరమైన పచ్చని బయళ్లు, దట్టమైన అడవులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఔత్సాహిక పర్యాటకులు ట్రెక్కింగ్ ద్వారా, మిగిలిన వారు గుర్రాలపై ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఏప్రిల్ 22న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దారుణమైన దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
కశ్మీర్‌లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని దేశ గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అభివర్ణించింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందని ఆరోపించింది. ఇటువంటి విషాదకర సమయంలో దేశం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. బీజేపీ మతపరమైన విభజనను తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మూడంచెల భద్రత ఉండాల్సిన పహల్గాంలో ఇటువంటి దారుణమైన దాడి జరగడం వెనుక నిఘా, భద్రతా వైఫల్యాలపై సమగ్రమైన సమీక్ష అవసరమని వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది. అప్పుడే మృతుల కుటుంబాలకు కొంతమేర న్యాయం జరుగుతుందని పేర్కొంది. ఇక త్వరలో ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రలో భక్తుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదో.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మిర్ డిమాండ్ చేశారు.