Toll plazas: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపు విధానంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా వెళ్లిపోవచ్చు, దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా కానుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు.
ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2026 కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, వాహనాలు, టోల్ ట్యాక్స్ చెల్లింపుల విధానం గురించి మాట్లాడారు. ఇప్పుడున్న ఫాస్టాగ్‌కు వాహన నంబర్‌ప్లేట్ గుర్తింపు సాంకేతికతను జోడించనున్నట్లు వెల్లడించారు. ఫాస్టాగ్, నంబర్‌ప్లేట్ రెండింటి సాయంతో వాహనాలను గుర్తించి టోల్ వసూలు చేయనున్నట్లు వివరించారు.
ఫిబ్రవరి నుంచి టోల్ ప్లాజాల వద్ద మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో వ్యవస్థ అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. కొత్త విధానం వల్ల టోల్ వసూళ్లు ఏటా రూ.10 వేల కోట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. టోల్ చెల్లించేందుకు వాహనాలు ఆగకపోవడంతో ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు.
ఫాస్టాగ్ రాకతో టోల్ ప్లాజాల వద్ద సమయం దాదాపు 80-90 శాతం తగ్గిందన్నారు సదరు మంత్రి. గతంలో 12 నిమిషాల వరకు వాహనాలు ఉండేవని, ఒక్కోసారి అది అరగంట కూడా పట్టేదన్నారు. మిగిలిన ఆలస్యాన్ని సాంకేతికతతో తొలగించనున్నట్లు వివరించారు. నిరీక్షణ సమయం తగ్గడం వల్ల ఆర్థిక-పర్యావరణ ప్రయోజనాలు చేకూరాయని తెలిపారు. వేగవంతమైన టోల్ ఫ్లాజా వల్ల ఏటా 71 కోట్ల గంటల సమయం ఆదా అవుతుందని అంచనా వేశారు. ఏడాదికి ఆదా సుమారు రూ. 68,500 కోట్లుగా ఉంది. పర్యావరణ ప్రయోజనాన్ని సుమారు 2.7 కోట్ల చెట్ల పెంపకంతో పోల్చారు.
ALSO READ: ‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
దేశ రవాణా డిజిటల్ మౌలిక సదుపాయాలలో ఫాస్టాగ్ ఒక ముఖ్యమైనది, ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందన్నారు. దశాబ్దం కిందట అంటే 2016లో ఫాస్టాగ్ పద్దతిని కేంద్రం తీసుకొచ్చింది. 2021 నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసింది. వాహనాలు టోల్ ప్లాజాను దాటినప్పుడు ఫాస్టాగ్ ద్వారా సంబంధిత వ్యక్తి ఖాతా నుంచి రుసుము ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. నగదు చెల్లింపులతోపాటు చిల్లర కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకపోవడంతో టోల్ వసూళ్లలో పద్దతి మారిందన్నారు. రానున్న దశలో టోల్ ప్లాజాల వద్ద అడ్డంకులు లేకుండా వాహనాలు నేరుగా వెళ్లేలా వ్యవస్థను రెడీ చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.