Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ ఎస్ కు అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించి మూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించారని, శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారని సీఎం మండిపడ్డారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారని గుర్తు చేశారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసినందుకు సభ్యులకు సీఎం అభినందనలు తెలిపారు.
సీఎల్పీ సమావేశం..
గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈసమావేశం లో ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి నర్సింహారెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్దయ్యల సేవలను స్మరించుకుంటూ సీఎల్పీ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. అంనతరం సంతాప తీర్మానాన్ని ఆమోదించించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేకనే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ శాసనసభ సాక్షిగా తీవ్ర కుట్రలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదని, అసెంబ్లీ వేదికగా శాసనసభాపతిని దూషించడం, పోలీసులను అడ్డుకోవడం, మహిళా అధికారుల ముందు అనుచితంగా ప్రవర్తించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.ఇక ఫామ్‌హౌస్ వేదికగా కేసీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ సజావుగా సాగకుండా పక్కా పథకం ప్రకారమే అల్లర్లు సృష్టించారని సీఎం ఆరోపించారు.
Also Read: PM విశ్వకర్మ నుండి UPI వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనపై బీజేపీ మాస్టర్ ప్లాన్!
ప్లాష్ సర్వేలో కీలక విషయాలు..
గత మూడు రోజుల అసెంబ్లీ పరిణామాలపై ప్రభుత్వం ఫ్లాష్ సర్వే నిర్వహించిందని, ప్రజలు బీఆర్ఎస్ హుందాతనం లేని ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారని సీఎం తెలిపారు. ప్రతిపక్ష కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి, పార్టీకే నష్టం చేయాలని చూస్తున్న కొందరు నేతల వైఖరిని సీఎం రేవంత్ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లు ప్రస్తుతం రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ప్రశ్నించారు. ఇక విధుల్లో ఉన్న పోలీసు అధికారుల్లో కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కనిపిస్తున్నట్టున్నట్లు ఉన్నారని గుర్తుచేశారు.
హాజరు సంపూర్ణంగా ఉండాలి..
అందుకే అంత ఆక్రోశంతో దాడులకు తెగబడుతున్నారని సీఎం తీవ్ర ఎద్దేవా చేశారు. మరోవైపు సభ్యులంతా అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగినంత కాలం హాజరు సంపూర్ణంగా ఉండాలన్నారు. హాజరు తగ్గితే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరని సీఎం చెప్పారు. సభ్యులంతా సభలో గొడవలకు తావులేకుండా తమ నియోజకవర్గాల స్థానిక సమస్యలను లేవనెత్తి పరిష్కరించుకోవాలన్నారు. అసెంబ్లీ సెంట్రల్ హాల్‌కు మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకుని గౌరవించుకున్నామని, సభ్యుల వెసులుబాటు కోసమే చారిత్రక భవనంలో శాసనమండలిని నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ చేపట్టిన సామాజిక-ఆర్థిక కుల సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, దీనిని జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఎస్ ఐ ఆర్ పేరుతో 15 కోట్ల ఓట్ల గల్లంతు..
దేశవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా ఉంటే, ఓటర్ల జాబితాలో 88 కోట్లు మాత్రమే చూపిస్తున్నారని మండిపడ్డారు.దేశవ్యాప్తంగా సుమారు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, ఎన్నికల వ్యవస్థకే ఇది ప్రమాదకరమని హెచ్చరించారు.తెలంగాణను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రతి ఎమ్మెల్యే తమ పరిధిలోని ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు.శాసనసభ్యుల వ్యక్తిగత ప్రవర్తన, ఓటర్ల హక్కుల పరిరక్షణ మాత్రమే రెండోసారి గెలుపును నిర్ణయిస్తాయని సీఎం స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
సీఎల్పీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం సాధించిన విజయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 27 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు హైజెనిక్ బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నామని తెలిపారు.అంతేగాక ప్రతి పేద కుటుంబానికి ‘ఇందిరమ్మ జీవిత బీమా’, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1 కోటి మేర ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు.పారదర్శకంగా కుల సర్వే నిర్వహించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత తెలంగాణదేనని, కేంద్రం చేసే జనగణనలోనూ దీనిని అమలు చేయాలని ఒత్తిడి తెస్తామని వెల్లడించారు.‘‘మనం చేసిన మంచి పనులను విస్తృతంగా ప్రచారం చేయకపోవడమే ప్రతిపక్షాలకు కలసివస్తోంది. మనం గట్టిగా ప్రచారం చేస్తే ప్రతిపక్షాలు ఆ ప్రజా ప్రవాహంలో కొట్టుకుపోతాయి. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారాన్ని వేగవంతం చేయాలి” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.
సమస్యలపై మంత్రుల సమగ్ర నివేదిక..
సమావేశంలో రాష్ట్రంలో ఎదురవుతున్న పలు కీలక అంశాలపై సంబంధిత మంత్రులు సీఎల్పీకి సమగ్ర వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావం , భవిష్యత్ తాగు, సాగునీటి నిర్వహణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.జాతీయ జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలన్న ప్రభుత్వ డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 22-ఏ భూముల సమస్యలు, నిషేధిత భూముల జాబితా సవరణపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.పాలిటెక్నిక్ విద్యార్థుల మౌలిక వసతులు, విద్యాబోధనపై తీసుకుంటున్న చర్యలను మంత్రి వివేక్ సీఎల్పీకి వివరించారు.
Also Read: 2027 జనగణనలో బీసీ లెక్కలు ఏవి? కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్!