IRCTC New Record: పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ రైల్వే రిజర్వేషన్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. రైలు టిక్కెట్ల బుకింగ్ వేదిక IRCTC సెప్టెంబర్ 7న 20 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ చరిత్రలో ఇదొక రికార్డు. ఒకరోజులో 20 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి కూడా. సెప్టెంబర్ 7న మొత్తం 20,06,353 టిక్కెట్లు బుక్ చేసినట్టు తెలిపింది.
దేశంలో రైల్వే రిజర్వేషన్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సామాన్యుడి తక్కువ ధరకు జర్నీ చేయవచ్చు. నార్మల్‌గా 10 రోజులకు ముందు టికెట్ బుక్ చేసినా కన్ఫార్మ్ కాలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రానున్న పండగల సీజన్‌కు ముందు రైల్వే రిజర్వేషన్లకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. దీంతో సెప్టెంబర్ 7న IRCTC ద్వారా మొత్తం 20,06,353 టిక్కెట్లు బుకింగ్ అయ్యాయి. రోజువారీ సంఖ్య 20 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8న ఆ స్థాయి రద్దీ కొనసాగింది. సెప్టెంబర్ 8 రోజున 19,50,699 టిక్కెట్లు బుక్ అయ్యాయి. గతేడాది పండుగ సీజన్‌లో ఒకే రోజు అత్యధికంగా బుక్ అయిన 18,40,203 టిక్కెట్ల కంటే ఇప్పుడు ఆరు శాతం ఎక్కువ. రికార్డు స్థాయిలో బుకింగ్‌లు జరిగినప్పటికీ.. వ్యవస్థలో ఎలాంటి పెద్ద సాంకేతిక లోపం లేదా అంతరాయం లేదని తెలిపింది.
ప్రస్తుతం రైల్వే టికెట్లు దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. ట్రావెలర్ల ట్రాఫిక్‌ను తట్టుకునేలా సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించింది ఐఆర్‌సీటీసీ. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ కొత్త సర్వర్లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జులై 15న సరికొత్త వెబ్‌సైట్, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. కొత్త వెబ్‌సైట్‌లో ప్రయాణికులు వివిధ తరగతుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూసుకోవచ్చు. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లతోపాటు మోసపూరిత బుకింగ్‌లు, బాట్‌ల వాడకంపై ఉక్కుపాదం మోపింది ఐఆర్‌సీటీసీ. యాంటీ-బాట్ సిస్టమ్ ద్వారా అనుమానాస్పద బాట్ ట్రాఫిక్‌ను 55 నుంచి 65 శాతం తగ్గించింది.
ALSO READ: మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్ తో ఈజీగా తెలుసుకోవచ్చు!
బుకింగ్ విండో తెరుచుకున్న మొదటి 10 నిమిషాల పాటు అంటే ఉదయం 8 నుంచి 8.10 వరకు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా నిబంధన తీసుకొచ్చింది. రిజర్వేషన్ విండో ఓపెన్ కాగానే టికెట్లు బుక్ చేసే యూజర్లకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. మోసపూరిత కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా 3.04 కోట్ల యూజర్ ఐడీలను డియాక్టివేట్ చేసింది. మరో 6.33 కోట్ల ఐడీలను పునఃపరిశీలన చేస్తున్నట్లు వెల్లడించింది ఐఆర్‌సిటిసి.