Operation Sindoor Updates: కొన్నాళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను బయటపెట్టింది భారత్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడులపై వివరణ ఇచ్చింది. అసలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వివరించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.
బుధవారం ఉదయం పదిన్నర గంటలకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ-కర్నల్ సోఫియా ఖురేషి- వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. ఉగ్రవాదులకు దాయాది దేశం స్వర్గధామంగా మారిందన్నారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం ఉందన్నారు.
పక్కా ఆధారాలతో దాడులు-భారత్
పహల్ గామ్ ఉగ్ర దాడి తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిపోయి, భారత్‌పై అనేక ఆరోపణలు చేసిందన్నారు. పహల్ గామ్ దాడి అత్యంత హేయమైనదిగా వర్ణించారు. ఈ ఘటనలో 25 భారత పౌరులు, ఒక నేపాలీ వ్యక్తి చనిపోయారని గుర్తు చేశారు. కాశ్మీర్ ను అతలాకుతలం చేసేందుకు ఈ దాడి జరిగిందన్నారు. కాశ్మీర్‌లో శాంతిని భగ్నం చేసేందుకు ఈ ప్రయత్నం చేశారన్నారు.
కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదులు లక్ష్యంగా ఉందన్నారు. కొంతకాలంగా కాశ్మీర్‌లో పర్యాటకం వృద్ధి చెందుతోందన్నారు. కుటుంబసభ్యుల కళ్ల ముందే కిరాతకంగా చంపారని గుర్తు చేశారు. లష్కరే తోయిబా, జైసే మహ్మద్ వంటి సంస్థలపై ఇప్పటికే నిషేధం ఉందన్నారు. వాటిపై నిషేధం విధించిన దృష్ట్యా టీఆర్ఎఫ్ పేరుగా కార్యకలాపాలు సాగుతున్నాయని విక్రమ్ వివరించారు.
ALSO READ: ఆపరేషన్ సింధూర్, లష్కరే తోయిబా కీలక నేత హతం
ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందన్న విక్రమ్, టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబాకు ఒక ముసుగులాంటిదన్నారు. ఉగ్రవాదులకు రక్షణగా టీఆర్ఎఫ్ ఉంటుందని తెలిపారు. టీఆర్ఎఫ్‌పై నిషేధం తొలగించాలని ఉగ్రవాద సంస్థలు పాక్ ఒత్తిడి చేశాయన్నారు. టీఆర్ఎఫ్-లష్కరే తోయిబా ఒక్కటేనన్నారు. వారి కుట్రలను నిఘా వర్గాలు సేకరించాయని గుర్తు చేశారు.
కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ స్థావరాలు ధ్వంసం
ముంబై దాడుల తర్వాత పహల్‌గామ్ ఘటనను అతి పెద్దదిగా ప్రభుత్వం వర్ణించిందన్నారు. ఆ దాడి తర్వాత పాకిస్థాన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. భారత్‌పై ఇంకా దాడులు చేసే అవకాశముందని చెప్పకనే చెప్పారు. అందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందన్నారు. భారత్ తన అధికారాన్ని ఉపయోగించుకుందని వివరించారు.
పహల్‌గామ్ మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సిందూర్ చేశామన్నారు. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి, వాటిని ధ్వంసం చేశామన్నారు. పాకిస్థాన్‌లోని సవాల్‌నాలా నుంచి బవాల్‌పూర్ వరకు దాడులు జరిగాయన్నారు. అక్కడి పౌరులకు నష్టం కలగకుండా దాడులు చేసినట్టు తెలిపారు.
ఎల్ఓసీకి 30 కిలోమీటర్ల దూరంగా కోట్లీ, 9 కిలోమీటర్ల దూరంగా బర్నాలపై దాడి చేశామన్నారు. సరిహద్దుకు సమీపంలోని సియోల్ కోట్ లోని మెహమూనా జాయా ప్రాంతంపై దాడి చేశామన్నారు. ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణ కేంద్రమన్నారు. అలాగే కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ తీసుకున్న స్థావరం ధ్వంసమైందన్నారు. అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నం చేస్తోందన్నారు.