Pahalgam Terror Attack : పెహల్గాం కాల్పుల ఘటనపై భద్రతా బలగాలు నిశితంగా పరిశీలించాయి. ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు? ఏ రకంగా కాల్పులు జరిపారనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకుని 10 నిమిషాల్లోనే కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు నిర్ధారించాయి. సుమారు 70 బుల్లెట్లు ఫైర్ చేసినట్టు తెలుస్తోంది.
3 స్పాట్‌లు.. ఆరుగురు టెర్రరిస్టులు..
కాల్పులు జరిపిన స్థలానికి అతి సమీపంలో ఉన్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. విదేశీ గన్స్‌తో పాటు.. కాల్పుల ఘటనను రికార్డ్ చేసేందుకు బాడీ కెమెరాలు ధరించారని తేల్చాయి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న 3 స్పాట్‌లను ఎంచుకుని.. ఆరుగురు ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు అంచనాకు వచ్చాయి.
పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఫైరింగ్
భద్రతా బలగాల పరిశీలన ప్రకారం ఏప్రిల్ 22న మధ్యాహ్నం 1.50 గంటలకు ఫస్ట్ బుల్లెట్ ఫైర్ చేశారు. ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో ఉండటంతో.. తమ దగ్గరకు వచ్చే వరకు వారిని గుర్తించలేకపోయారు. దాడులు జరిగే సమయంలో చిన్నారులు ఆడుకుంటుంటే… పెద్దలు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. టూరిస్టుల మతం తెలుసుకుని మరీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అతి సమీపం నుంచి.. నేరుగా పర్యాటకుల తలలపైనే గురి పెట్టి.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి.
దారిలోని చోట దారుణం
కాల్పులు జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు రావడానికి ఆలస్యం అయింది. 5 కిలోమీటర్లు కేవలం కాలి నడక, గుర్రాల ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలరు. మధ్యాహ్నం 3 గంటలకు స్పాట్‌కు చేరిన పోలీసులు సహాయక చర్యలు మొదలు పెట్టారు. పోలీసులు మరికాస్త ముందుగా వచ్చి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక టూర్ ఆపరేటర్ మరణించినట్లు భద్రతా బలగాలు ధృవీకరించాయి.
Also Read : కల్మా అంటే ఏంటి? వాళ్లను ఉగ్రవాదులు ఎందుకు వదిలేశారంటే..
కశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్
ఫైరింగ్ తర్వాత ఎటువైపు నుంచి వచ్చారో అటువైపుగానే టెర్రరిస్టులు వెళ్లిపోయినట్టు గుర్తించారు. అటవీ ప్రాంతం కావడంతో. పోలీసులు, ఆర్మీ జవాన్లు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నారు. మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఉధంపూర్, డూడు బసంత్‌గఢ్ ప్రాంతంలో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. అయితే, ఈ ఉగ్రవాదులు పహల్గామ్ ముష్కరులేనా కాదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్‌కౌంటర్ ప్రదేశానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు.