Terror Attack : ఉగ్రవాదులు సైతాన్‌లుగా మారారు. కశ్మీర్‌లో నరమేధానికి పాల్పడ్డారు. పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ముష్కర మూక కోసం ఆర్మీ వేట కొనసాగుతోంది.
పర్యాటకులు అందరినీ చంపేయలేదు కిరాతకులు. కేవలం హిందువులనే టార్గెట్ చేశారు. పేరు, ఐడీ కార్డులు అడిగి మరీ కాల్చేశారు. మహిళలను, పిల్లలను వదిలేశారు. వాళ్ల కళ్ల ముందే మగవారిని దారుణంగా చంపేశారు. వారిప్పుడు బతికున్న శవాలుగా మిగిలారు. ఇంతకంటే అమానుషం ఇంకేం ఉంటుంది? జీవితాంతం వారికి నరకయాతనే.
చంపే ముందు పర్యాటకులకు పరీక్ష
చంపేముందు పర్యాటకులకు ఓ పరీక్ష పెట్టారు ఉగ్రవాదులు. వాళ్లు హిందువులో, ముస్లింలో తేల్చేందుకు “కల్మా” చదవమన్నారు. ఎవరైతే కల్మా చదివారో వారు ముస్లిం అని కన్ఫామ్ చేసుకుని వదిలేశారు. కల్మా చదవలేని వాళ్లు నాన్-ముస్లిం అని ఫిక్స్ చేసి కాల్చిపడేశారు. అంటే, పక్కా ప్లాన్డ్‌గా టెర్రర్ అటాక్ జరిగిందని తెలుస్తోంది. ఇస్లాం ప్రేరేపిత ఉగ్రవాదానికి ఈ మారణహోమం సాక్షంగా నిలుస్తోందని అంటున్నారు.
‘కల్మా’ or ‘కలిమా’ అంటే ఏమిటి?
ఇస్లాంలో ‘కల్మా’ అత్యంత కీలకం. ‘కలిమా’ అని కూడా అంటారు. ఇది అరబిక్ పదం. ముస్లింలకు అత్యంత పవిత్రం. కొన్ని పవిత్ర పదాల సమూహాన్ని కల్మా అంటారు. “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్”. ఈ పదబంధాన్ని కల్మా అని పిలుస్తారు. ఇది పఠించే వాళ్లు మాత్రమే ముస్లింలు అవుతారు. “అల్లాహ్ మినహా వేరే దేవుడంటూ లేడు.. అల్లాహ్ యొక్క దూత ముహమ్మద్” అనేది కల్మా మీనింగ్.
ముస్లిం అని ఎవరిని అంటారంటే..
రెండు వ్యాఖ్యాలతో ఉండే కల్మా దేనికదే ప్రత్యేకం. ముస్లింలకు అల్లాహ్ మాత్రమే దేవుడు.. ఆయనే ప్రతిదీ సృష్టించాడు.. మరెవరూ పూజకు అర్హులు కాదని వారు నమ్ముతారు. అల్లాహ్ తన సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఎంచుకున్న చివరి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ అని నమ్ముతారు. ఇదీ కల్మా సారాంశం. కల్మా or కలిమా చెప్పడం ద్వారా.. ముస్లింలు అల్లాహ్‌ను, ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరిస్తామని వాగ్దానం చేసినట్టు అవుతుంది. ఎవరైనా నమ్మకంతో కల్మా చెబితే.. వారు ఇక అధికారికంగా ముస్లిం అవుతారు.
కలిమాలో 6 రకాలు..
ముస్లింలు ప్రతిరోజూ 5 సార్లు ప్రార్థనలు చేస్తారు. వారి ప్రార్థనల సమయంలో కల్మా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు తమ పిల్లలకు చిన్న వయస్సు నుంచే కల్మా నేర్పిస్తారు. కంఠస్థం చేసి పఠిస్తారు. ఇస్లాంలో మొత్తం 6 కలిమా లు ఉన్నాయి. అందులో మొదటిదే అత్యంత ప్రధానం. “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అనేది మొదటి కలిమా. దీన్నే ‘కలిమా తయ్యిబా’ అంటారు. ఎవరైనా ఇస్లాంను స్వీకరించాలని అనుకుంటే ఈ మొదటి కలిమానే కీలకం. ప్రాంతాల వారీగా.. వేరు వేరు సందర్భాల్లో ఈ ఆరు కల్మాలను పఠించే అలవాటు ఉంది. ప్రతీ కల్మా అల్లాహ్‌ను స్తుతిస్తుంది.
1. కలిమా తయ్యిబా.. అంటే విశ్వాస ప్రకటన అని అర్థం.
2. కలిమా షహదహ్.. దీని అర్థం సాక్ష్యం.
3. కలిమా తమ్జీద్.. అంటే అల్లాహ్ మహిమ అని మీనింగ్.
4. కలిమా తౌహీద్.. అల్లాహ్ యొక్క ఏకత్వం.
5. కలిమా ఇస్తిగ్‌ఫర్.. క్షమాపణ కోరడం.
6. కలిమా రద్దే కుఫ్ర్ అంటే అవిశ్వాసాన్ని తిరస్కరించడం అని భావం.
Also Read : ఒక యుద్ధమే.. పాక్‌కు మోదీ వార్నింగ్
ఉగ్రవాదులకు కల్మా అసలు భావం తెలుసా?
అందుకే, కశ్మీర్ పహల్గాంలో ముస్లిం ఛాందస ఉగ్రవాదులు.. పర్యాటకులపై దాడి చేసినప్పుడు కల్మా ఆధారంగా వారు ముస్లింలు అవునో, కాదో ఎంచుకున్నారు. ఎంతటి మత మూఢత్వం ఉంటే అలా చేస్తారు? కల్మా చదవమని బెదిరించి.. అది చదవలేని వాళ్లు హిందువులని డిసైడ్ చేసి.. కాల్చి చంపేశారు ముష్కరులు. అయితే, ఖురాన్ కానీ, కల్మా కానీ, ఏ ముస్లిం సూక్తి కానీ.. సాటి మనుషులను చంపమని చెప్పలేదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయి.. మూర్ఖత్వంతో, మూఢత్వంతో హిందువులను దారుణంగా చంపిసేరు ఆ సైతాన్ గాళ్లు.