QR Code Pan Cards : పాన్ కార్డు సేవలను మరింత విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డును ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థలో సాధారణ వ్యాపార గుర్తింపు కార్డుగా చేయడం కోసం పాన్ ప్రాజెక్ట్ 2.0 కింద కేంద్రం కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. ఇందుకోసం తాజాగా ఆమోదముద్ర కూడా వేసినట్టు సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అర్ధిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం పాన్ కార్డు సేవలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పాన్ కార్డును సామాన్య వ్యాపార గుర్తింపు కార్డుగా చేయడం కోసం రూ.14.35 కోట్లను కేంద్రం ప్రకటించినట్టు తెలిపారు.
పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా చెల్లింపు దారులు రిజిస్ట్రేషన్ సేవలను మరింత తేలికగా జరుపుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతికంగా మార్పులు చేయడంతో పాటు తేలిగ్గా వేగంగా మెరుగైన నాణ్యతతో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక కొత్త కార్డులను క్యూఆర్ కోడ్ తో జారీ చేస్తామని వెల్లడించారు.
ఇక కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పాన్ కార్డు సేవలు మరింత మెరుగ్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాన్ కార్డు ఇన్ యాక్టివ్ గా ఉంటే కచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలని సైతం అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయని సమయంలో, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నా, నకిలీ పాన్ కార్డులు ఉపయోగిస్తున్నా ఇన్ యాక్టివ్ గా మారిపోతుంది.
పాన్ కార్డు యాక్టివేట్ గా ఉందని ఎలా గుర్తించాలి అంటే.. ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎడమ వైపున ఉన్న లింక్ ను క్లిక్ చేయాలి. Verify PAN status అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఇక్కడ వచ్చే కొత్త పేజ్ లో పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్ ఫోన్ నెంబర్ ను నమోదు చేయాలి ఇక ఆ తర్వాత ఫోన్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. కన్ఫామ్ పైన క్లిక్ చేసి పాన్ కార్డ్ యాక్టివ్ గా ఉందా లేదా అనే విషయాన్ని తేలికగా తెలుసుకోవచ్చు.
ఇక ఈ కార్డులను గుర్తించి ముందుగా ఆదాయ పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అసెన్సింగ్ ఆఫీసర్ కి లేఖ రాసి ఆదాయపన్ను శాఖకు అనుకూలంగా నష్టపరిహారం బాండును పూరించాలి. ఇక గత మూడు సంవత్సరాలుగా డీయాక్టివేట్ గా ఉన్న పాన్ కార్డును ఉపయోగించి దాఖలు చేసిన ఐటీఆర్ ను కూడా ఇవ్వాలి. ఆపై ప్రాంతీయ ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో పత్రాలను సమర్థిస్తే పాన్ కార్డు 15 రోజుల్లో యాక్టివేట్ అవుతుంది. ఇక వీలైనంత త్వరగా ఈ కార్డులను యాక్టివేట్ చేసుకోవటం మంచిది.
ALSO READ : గూగుల్ కు మరో దారిలేదా.. క్రోమ్‌ను అమ్మేస్తుందా?