Pappu Yadav-Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ రాజేష్ రంజన్, అలియాస్ పప్పు యాదవ్ రంగంలోకి దిగారు. సల్మాన్ కు ఫోన్ చేసి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాను అండగా ఉంటానని చెప్పారు. భయపడాల్సి అవసరం లేదన్నారు. ఇటీవలే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను 24 గంటల్లో లేపేస్తానని ప్రకటించిన పప్పు యాదవ్, ఇప్పటికే ముంబైకి వెళ్లి బాబా సిద్ధికి కొడుకును కలిశారు. సిద్దిఖీ మరణానికి కారణం అయిన వాళ్ల వదిలి పెట్టటని హామీ ఇచ్చారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేశారు. “నేను ముంబై నుంచి తిరిగి వస్తున్నాను. సల్మాన్ సిటీకి దూరంగా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వ్యక్తిగతంగా కలవలేకపోయాను. ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాను. అతడికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. అతడు ధైర్యంగా ఉన్నాడు. చాలా ధైర్యవంతుడు కూడా..” అని పప్పు యాదవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
मुंबई से लौट रहा हूं। शहर से दूर शूटिंग में
व्यस्त होने के कारण फिल्म अभिनेता सलमान
खान जी से मुलाकात नहीं हो पाई।उन्हें भी
आश्वस्त करना चाहता था मैं हूं ना!उनसे फोन पर लंबी बात हुई,वह निडर निर्भीक हैं
अपना काम और इंसानियत को पहली प्राथमिकता
बताया! हर परिस्थिति में मैं साथ हूं
— Pappu Yadav (@pappuyadavjapl) October 25, 2024
24 గంటల్లో బిష్ణోయ్ నెట్ వర్క్ ను ఫినిష్ చేస్తా- పప్పు యాదవ్
ఎన్సీపీ నేత, సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని ఇటీవల ముంబైలో కాల్చి చంపారు. అక్టోబర్ 12న తన కుమారుడి ఆఫీస్ బయట దసరా సందర్భంగా క్రాకర్స్ పేలుస్తుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న షూటర్లతో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ టచ్ లో ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు. సబర్మతి (గుజరాత్) జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఈ ప్లాన్ వేశారని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. అదే సమయంలో పప్పు యాదవ్.. బిష్ణోయ్ బ్యాచ్ ను లేపేస్తానని ప్రకటించారు. “చట్టం అనుమతిస్తే, లారెన్స్ బిష్ణోయ్ వంటి పనికిమాలిన నేరస్థుడి నెట్‌వర్క్ మొత్తాన్ని 24 గంటల్లో లేపేస్తా. ఒక నేరస్థుడు జైలులో కూర్చుని ప్రజలను సవాల్ చేస్తూ, చంపేస్తున్నాడు. అందరూ మౌనంగా చూస్తూ ఊరుకున్నా, నేను మాత్రం సహించను” అని ప్రకటించారు.
సల్మాన్ ను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్
మరోవైపు, సల్మాన్ ఖాన్ ను రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు జంషెడ్ పూర్ లో అరెస్టు చేశారు. నిందితుడి పేరు షేక్ హుస్సేన్ గా పోలీసులు తెలిపారు. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహితంగా ఉన్నట్లు వెల్లడించారు. బిష్ణోయ్ బ్యాచ్ తో గొడవ ఉండకూడదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ రీసెంట్ గా ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ కు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ మీద దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సల్మాన్‌కు ఇటీవల గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో భద్రత పెంచారు. ప్రత్యేక బృందం అతడి ఇంటి దగ్గర పహారా కాస్తున్నది.
బిష్ణోయ్ ని చంపిన వారి రూ.కోటి బహుమతి
తాజాగా జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ని హత్య చేస్తే వారికి రూ. కోటి రూపాయల బహుమానం ఇస్తామని రాజస్థాన్ కు చెందిన క్షత్రియ కర్ణి సేన ప్రకటించింది. డిసెంబర్ 2023లో క్షత్రియ కర్ణి సేన అగ్రనేత, రాజ్‌పుత్ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడీ హత్యకు ప్రతీకారంగా కర్ణి సేన ప్రస్తుత నాయకుడు రాజ్ శెఖావత్ ఈ ప్రకటన చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.