Parvesh Vs Rekha: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? రోజుకో పేరు తెరపైకి వస్తోందా? బీజేపీ హైకమాండ్ దృష్టి ఎటువైపు? సీఎం కుర్చీ మహిళలకు ఇవ్వాలని భావిస్తోందా? అదే జరిగితే పర్వేశ్ వర్మ మాటేంటి? రేసులో ఉన్న నేతలకు పార్టీ పదవులు అప్పగిస్తారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి ఢిల్లీ సీఎం ఎవరనేది తెలియనుంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.
ఢిల్లీ సీఎం ఎవరు?
ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ కొద్దిగంటల్లో క్లారిటీ ఇవ్వనుంది. ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాల మాట. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రేఖ గుప్తా పేరును బుధవారం సాయంత్రానికి వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రేఖ గుప్తా గురించి బీజేపీ నేతలకు బాగా తెలుసు. పార్టీలో ఆమె అనేక పదవులు నిర్వహించారు. జాతీయ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేశారు. పార్టీ పెద్దలతో మంచి సంబంధాలు ఉండడంతో ఈమెకే దాదాపు ఖాయమన్నది ఆ కథనాల సారాంశం.
మొన్నటి ఎన్నికల్లో రేఖ గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఈ నేపథ్యంలో సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలన్నది హైకమాండ్ ఆలోచన. పార్టీ కోసం రేఖ గుప్తా పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఉన్నత వర్గాలకు చెందిన మహిళ కూడా. ప్రస్తుతం కాంగ్రెస్ ఆలోచన బీసీ వైపు ఫోకస్ చేసింది. మహిళను తెరపైకి తెస్తే బాగుంటుందన్నది కొందరు కమలనాథులు మాట.
ALSO READ: మహా కుంభ్ కాదు.. మృత్యుకుంభ్
బీజేపీ పాలిత రాష్ట్రాల ఫార్ములా
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారికే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు బీజేపీ పెద్దలు. అదే ఫార్ములాను ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రేఖ గుప్తా. పార్టీలో సీనియర్ కూడా. బుధవారం జరగనున్న బీజేఎల్పీలో ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది.
బీజేపీ పరిశీలకులు గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. పార్టీలో గ్రౌండ్ లెవల్ పరిస్థితిని విశ్లేషించారు. సీఎం పదవి ఉన్నతవర్గానికి చెందిన వారికి ఇస్తే, డిప్యూటీ సీఎం పదవి బీసీ లేదా దళిత వర్గాలకు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రులతో పాటు మరో ఆరుగురు మంత్రులను ఎంపిక చేసినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేసే పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి ఇస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
రేసులో వాళ్లంతా.. చివరకు
సీఎం రేసులో రేఖ గుప్తా లేదంటే పర్వేశ్ వర్మల్లో ఒకరు ఖాయమని అంటున్నారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పర్వేష్ వర్మ పని తీరును పరిగణనలోకి తీసుకుంది బీజేపీ. సీఎం పదవికి బలమైన వ్యక్తిగా గుర్తించారు. ఆ సమయంలో రేఖా గుప్తా, విజేంద్ర గుప్తా, వీరేంద్ర సచ్‌దేవా, సతీష్ ఉపాధ్యాయ్ నుండి గట్టిపోటీ నెలకొంది. సచ్‌దేవా ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయనను పక్కనపెట్టారట. ఈ సమయంలో రేఖ గుప్తా పేరు బలంగా వినిపించింది. ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేకపోవడంతో ఆ పదవికి మహిళను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కమలనాథులు చెబుతున్నారు.