Mamata Banerjee Mahakumbh | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశమైన ‘మహా కుంభ మేళా’ను గురించి మమతా బెనర్జీ, “ఇది మహా కుంభ కాదు, మృత్యు కుంభం” అని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో మమతా బెనర్జీ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై స్పందించారు. “కుంభమేళాకు వెళ్లిన భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. యూపీ ప్రభుత్వం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసింది. కోట్ల సంఖ్యలో వస్తున్న సామాన్య ప్రజల కోసం ఎలాంటి సదుపాయాలు లేవు. నేను మహా కుంభమేళాను గంగామాతకు గౌరవ సూచికగా భావిస్తున్నాను. కానీ పేద ప్రజలకు కనీస సదుపాయాలు కూడా లేవు. వీఐపీల కోసం మాత్రమే ఏర్పాట్లు చేశారు,” అని ఆమె ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై ఘటు విమర్శలు చేశారు.
తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబాలకు ఇప్పటిదాకా ఎలాంటి పరిహారం అందలేదని మమతా బెనర్జీ విమర్శించారు. “పోస్ట్‌మార్టం చేయకుండానే మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. పోస్ట్‌మార్టం చేసి, మరణ ధృవీకరణ పత్రం జారీ చేస్తేనే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుంది. ఇప్పుడు బాధిత కుటుంబాలు ఎలా పరిహారం పొందగలరు?” అని ఆమె ప్రశ్నించారు. ప్రయాగ్‌రాజ్ నగరంలో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభ మేళా 45 రోజులపాటు, అంటే ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
Also Read: నీటిని వృథా చేస్తున్నారా? ఏకంగా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..
అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. బిజేపీ నేతలకు సవాల్
మరోవైపు అసెంబ్లీ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ బిజేపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. “బంగ్లాదేశ్ ఛాందసవాదులతో నాకు సంబంధం ఉందని నిరూపిస్తే, నేను నా పదవికి రాజీనామా చేస్తాను,” అని ఆమె ప్రకటించారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో చేతులు కలిపారని బిజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ బిజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
“అసెంబ్లీలో మాట్లాడటానికి అనుమతించడం లేదని బిజేపీ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారు. విద్వేషాలను వ్యాప్తి చేయడానికి, ప్రజలను విభజించడానికి వారికి వాక్ స్వాతంత్రం ఇవ్వడం లేదు. బిజేపీ మతాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది. నేను జాతీయ భద్రత లేదా విదేశాంగ విధానం వంటి అంశాల్లో జోక్యం చేసుకోను. కానీ, అమెరికా నుంచి అక్రమ వలసదారులను గొలుసులతో బంధించి తిరిగి పంపించడం సిగ్గుచేటు. వారిని అమెరికా నుంచి తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం విమానాలు పంపాలి. బిజేపీ ఎమ్మెల్యేలు నన్ను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. అందుకే నేను సభలో మాట్లాడుతున్నప్పుడు బహిష్కరించి వెళ్లిపోతున్నారు,” అని ఆమె ఆక్షేపించారు.
మరోవైపు మమతా బెనర్జీ మహాకుంభమేళాను మృత్యుకుంభ్ అనే వ్యాఖ్యానించడంపై బిజేపీ నాయకులు ఆమెను తప్పుబట్టారు. ఆమె హిందూ వ్యతిరేకి అని తీవ్రంగా విమర్శించారు. మహాకుంభమేళా లాంటి అత్యంత మహా కార్యక్రమం గురించి ఆమె కించ పరిచే వ్యాఖ్యలు చేశారని.. ఇది హిందూ సంస్కృతిని అవమానించడమేనని బెంగాల్ బిజేపీ నాయకుడు సువేందు అధికారి మండిపడ్డారు.