PM Modi To Visit Russia: ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు రష్యాతో పాటు మోదీ ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేయనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన విషయాలను భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. గత ఐదేళ్లలో మోదీ రష్యా పర్యటన తొలిసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తర్వాత మాస్కోను మోదీ సందర్శించడం ఇదే మొదటి సారి. ఇదిలా ఉంటే భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. 22వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. అంతే కాకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలను నేతలిద్దరూ చర్చిస్తారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చలు జరుపనున్నారు. ఈ తర్వాత ఆస్ట్రియాకు మోదీ వెళ్లనున్నారు. అక్కడి స్థానిక నేతలతో మోదీ సమావేశం అవుతారు. అక్కడి వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాస్కో, వియన్నాల్లోని ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడనున్నారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: ప్రధాని మోదీ తొలుత మణిపూర్ ఆ తర్వాతే.. జైరాంరమేష్ కామెంట్స్
ప్రధాని మోదీ 2019లో రష్యాలో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇప్పటివరకు రష్యా, భారత్ మధ్య 21 సార్లు వార్షిక భేటీలు జరిగాయి. చివరి సారిగా 2021 డిసెంబర్‌లో ఢిల్లీ వేదికగా పుతిన్ ఈ చర్చల్లో పాల్లొన్నారు. మూడేళ్ల విరామం తర్వాత 22వ వార్షిక సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించే విషయాన్ని పుతిన్ మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.