Modi US Tour : అక్రమ వలసదారులను తిప్పి పంపించడం, వీసా నిబంధనల్లో మార్పులు సహా అనేక అంతర్జాతీయ కీలకాంశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. డోనాల్డ్ ట్రంప్ నతో చర్చలు ముగించుకుని ప్రధాని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. దాదాపు 4 నిముషాలున్న ఈ వీడియోలో మోదీ అమెరికాలో ఆతిథ్యం నుంచి తిరుగు ప్రయాణం వరకు అనేక అంశాలున్నాయి. మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ ట్రంప్ తో మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, భారత్ లో గొప్ప నేత మీరంటూ ట్రంప్ ప్రధాని మోదీకి కితాబిచ్చారు. వాటితో పాటే.. ఆకట్టుకునే అనేక అంశాల కలయికగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అలాగే.. అనేక చర్చలు, కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోదీ.. రెండు రోజుల పర్యటన ఫలప్రదమైందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
తన పర్యటనలో విద్యారంగం నుంచి అణు శక్తి రంగాల వరకు, వాణిజ్యం నుంచి సాంకేతిక రంగాల వరకు ఎన్నో విషయాలపై చర్చించినట్లు తెలిపారు. అలాగే.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న శాస్త్ర పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ నుంచి అంతరిక్షం వరకు కీలక విషయాలపై భారత్ – అమెరికా మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయంటూ తెలిపారు.
Here are highlights from an extremely fruitful USA visit…
From energy to education, trade to technology and AI to space…many issues discussed. pic.twitter.com/kJ5EDROrAb
— Narendra Modi (@narendramodi) February 14, 2025
అమెరికాలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. అత్యంత ప్రముఖులకు మాత్రమే కేటాయించే.. వాషింగ్టన్ డీసీలోని ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ అయిన బ్లెయిర్ హౌస్ దగ్గర ప్రధాని మోదీకి లభించిన ఘన స్వాగతం దగ్గర నుంచి ప్రారంభమైన వీడియోలో అనేక ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఇందులో.. ప్రధాని మోదీ విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, టెక్ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి వారితో ప్రధాని మాట్లాడుతున్న విజువల్స్ ఉన్నాయి.
ఈ వీడియోలో.. ఈసారి పర్యటనలో మొదటి సారి వైట్ హౌస్ లో కలుసుకున్న ప్రధాని మోదీ – ట్రంప్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ వీడియోలో.. అమెరికా పర్యటన సందర్భంగా తన అనుభవాన్ని తెలిపేందుకు ప్రధాని మోదీ సందర్శకుల పుస్తకం దగ్గర కూర్చోగా, ట్రంప్ ఆయనకు కూర్చిని సరిచేయడం కనిపిస్తుంది. అలాగే.. నరేంద్ర మోదీ కూర్చీలోనుంచి లేస్తున్నప్పుడు సైతం.. ట్రంప్ స్వయంగా కూర్చీని వెనక్కి లాగడం.. ప్రధాని మోదీకి ట్రంప్ ఇచ్చే గౌరవం, విలువకు నిదర్శంగా కనిపిస్తున్నాయంటూ.. అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ అనేక కీలక వ్యక్తులతో చర్చలు జరిపారు. అమెరికాకు కొత్తగా నియమితులైన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ తో పాటు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారితో చర్చలు జరిపారు. వైట్ హౌస్ లో నాలుగు గంటల పాటు విస్తృత చర్చలు, వ్యూహాత్మక, భద్రతా సహకారంపై చర్చలు జరిపారు. అలాగే.. భారత్ – అమెరికా దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, సాంకేతికత, ఇంధన భద్రతతో పాటుగా ఇండో-ఫసిఫిక్ ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చలు జరిగాయి. ఇటీవల అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపైనా ఇరుదేశాల అధినేతలు విస్తృత స్థాయి చర్చలు జరిపారు.
Also Read : ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ది తటస్థ వైఖరి కాదు.. ట్రంప్‌తో భేటీలో మోదీ!
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత వైట్ హౌస్ లోకి అడుగుపెట్టడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపగా.. భారత్ లో వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఎంపికైన మోదీకి ట్రంప్ అబినందనలు తెలిపారు. ఆయన చాలా గొప్ప నేత అని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని గొప్ప ఐక్యత, స్నేహానికి గుర్తులు అంటూ అభివర్ణించారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత అమెరికాను సందర్శించిన తొలి ప్రపంచ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరు. ట్రంప్ భాద్యతలు స్వీకరించిన తొలి మూడు వారాల్లోనే ప్రధాని, ట్రంప్ ను కలిసి అభినందనలు తెలపడంతో పాటు ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మరి మోదీ పర్యటనతోనైనా ట్రంప్ మనసు మారుతుందా? అక్కడి భారతీయులు ఇక ఏ టెన్షన్ లేకుండా కొనసాగవచ్చా అనేది త్వరలోనే తెలియనుంది.