PM Modi: తల్లి చనిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తల్లి పాడె కూడా మోశారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుండెల నిండా విషాదం. మది నిండా అమ్మ ఆలోచనలు. మరొకరైతే కోలుకోవడానికి చాలాకాలమే పడుతుంది. కానీ, మోదీ మాత్రం అంత ఆవేదనలోనూ ప్రధానిగా తన విధులను మర్చిపోలేదు. బాధ దిగమింగుతూనే.. గుజరాత్ లో నుంచే బెంగాల్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వర్చువల్ గా ప్రారంభించారు. పని పట్ల నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం పీఎం మోదీ కోల్ కతాలో పర్యటించాల్సి ఉంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి గతంలోనే షెడ్యూల్ ఖరారైంది. కానీ, మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరడంతో.. తల్లిని చూసేందుకు హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు మోదీ. శుక్రవారం ఉదయం హీరాబెన్ మరణంతో అక్కడే ఉండిపోయారు. దీంతో శుక్రవారం నాటి కోల్ కతా పర్యటన రద్దు అయింది.
అయితే, తాను బెంగాల్ కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా.. వీడియో కాన్షరెన్స్ లో షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు నిర్వహించారు ప్రధాని మోదీ. హవుడా, న్యూ జల్‌పయ్‌గురిని కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం భాగమయ్యారు.
తాను బెంగాల్‌కు రావాల్సి ఉందని.. కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బెంగాల్ వాసులు తనను క్షమించాలని కోరారు.
మరోవైపు, ప్రధాని మోదీకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సానుభూతి ప్రకటించారు. ‘‘మాతృమూర్తి మరణం విచారకరం. మీకు తీరని లోటే. దుఃఖం నుంచి బయటపడేలా ఆ భగవంతుడు మీకు స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. దయచేసి కాస్త విశ్రాంతి తీసుకోండి మోదీజీ’’ అని సీఎం మమతా విచారం వ్యక్తం చేశారు.