TATA C-295 Aircraft: భారత దేశంలో విమానాల ఉత్పత్తి మొదలవుతుందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. 2026 సెప్టెంబర్ నాటికి తొలి విమానాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో వడోదర ఫ్యాక్టరీ తయారైన విమానాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.
సోమవారం గుజరాత్‌లోని వడోదరలో C-295 డిఫెన్స్ రవాణా విమానాల తయారీ ప్లాంట్ ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్. 2026 సెప్టెంబర్ నాటికి తొలి విమానాన్ని అందించాలన్నది ఈ ప్లాంట్ ముఖ్యఉద్దేశం.
మొత్తం 56 విమానాల కొనుగోలుకు రూ. 21,935 కోట్లతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2031 నాటికి మొత్తం 40 విమానాలు తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. 16 విమానాలను స్పెయిన్ నుంచి నేరుగా అందించేలా డీల్ కుదిరింది. ఇప్పటికే ఆరు విమానాలను అందజేసింది ఎయిర్‌బస్ డిఫెన్స్ సంస్థ.
ఎయిర్ బస్ డిఫెన్స్ సంస్థతో కలిసి గుజరాత్‌లోని వడోదరలో ప్లాంట్ ఏర్పాటు చేసింది టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్. రక్షణ శాఖ కోసం 40 విమానాలను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నాయి ఎయిర్‌బస్-టాటా సంస్థలు. ఎక్కువ బరువైన వస్తువులను అధిక సామర్థ్యంతో తీసుకెళ్లగల్గడమే ఈ విమానం స్పెషాలిటీ.
ALSO READ: డిజిటల్ అరెస్ట్ స్కామ్‌తో 4 నెలల్లోనే రూ.120 కోట్లు దోపిడీ.. ప్రభుత్వ నివేదికలో షాకింగ్ వివరాలు
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ తొలి ఇండియా పర్యటన అని, ఇవాళ నుంచి ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం కొత్త దశ మొదలవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీ భారతదేశం -స్పెయిన్ సంబంధాలను మరింత పెంపొందించనుందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్‌ను బలోపేతం చేస్తుందని చెప్పుకొచ్చారు.
దివంగత రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఆయన ఇవాళ మన మధ్య ఉంటే సంతోషించేవారని వివరించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ న్యూ ఇండియా యొక్క కొత్త పని సంస్కృతిని ప్రతిబింబిస్తుందన్నారు. భవిష్యత్తులో ఇక్కడ తయారైన విమానాలు విదేశాలకు ఎగుమతి అవుతాయని బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు పెద్ద కంపెనీలుగా మార్చామని తెలిపారు. డీఆర్ఢీఓ, హల్‌ను బలోపేతం చేశామన్నారు. యూపీ, తమిళనాడులో రెండు పెద్ద రక్షణ కారిడార్లను నిర్మించామని తెలిపారు. ఇలాంటి ఎన్నో నిర్ణయాలు రక్షణ రంగంలో కొత్త శక్తిని నింపాయన్నారు.
దేశంలో వివిధ విమానయాన సంస్థలు భవిష్యత్తులో 1200 కొత్త విమానాల కోసం ఆర్డర్లు రెడీ చేస్తున్నాయన్నారు. ప్రపంచ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి పౌర విమానాల రూపకల్పన తయారీలో భారత్ ప్రధాన పాత్ర పోషించనుందని చెప్పకనే చెప్పారు ప్రధాని మోదీ.