తమిళనాడులో రజినీకాంత్, విజయ్ మధ్య ఫ్యాన్ వార్ అందరికీ తెలిసిందే. ఇదిప్పుడు పొలిటికల్ వార్ గా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు కానీ, రజినీకాంత్ రాలేదు కదా, అయినా ఎందుకీ గొడవ అనుకుంటున్నారా? రజినీ తాజాగా చేసిన కీలక వ్యాఖ్యలే ఈ గొడవకి కారణం. తమిళనాడులో స్టాలిన్ ని ఎదుర్కొనేవారు లేరంటూ రజినీకాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై హీరో విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫ్యాన్ వార్ మొదలైంది. రజినీని ప్యాకేజ్ స్టార్ అంటూ విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటిికి ఈ ఫ్యాన్ వార్ మరింత ముదిరేలా ఉంది.
సింగిల్ గానే విజయ్..
రాజకీయాల్లోకి వచ్చే విషయంలో తటపటాయించారు కానీ, రాజకీయ నాయకుల్ని సపోర్ట్ చేసే విషయంలో మాత్రం రజినీ ఏమాత్రం మొహమాట పడరు. గతంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రజినీ చంద్రబాబుని సపోర్ట్ చేశారు. తనపై లేనిపోని విమర్శలు వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు. తాజాగా తమిళనాడులో ఆయన సీఎం స్టాలిన్ ని ఆకాశానికెత్తేశారు. “స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్‌గా మారారని చెప్పారు. తన స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారంటూ జోస్యం చెప్పారు. స్టాలిన్ పై రజినీకి ఉన్న అభిమానానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనం. అయితే ఇక్కడ హీరో విజయ్ అభిమానులు నొచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనేది తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ ఆశ. దానికి తగ్గట్టే ఆయన ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. సడన్ గా ఇప్పుడు రజినీకాంత్, స్టాలిన్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి విజయ్ అభిమానులు రజినీపై ఎదురుదాడి ప్రారంభించారు.
రజినీపై విమర్శలు..
రజినీకాంత్ ని ప్యాకేజీ స్టార్ గా అభివర్ణిస్తూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. డీఎంకే పార్టీకి అనుబంధంగా ఉండే ప్రొడక్షన్ హౌస్ నుంచి రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రజినీనే కాదు, కమల్ హాసన్ ని కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ తమ గ్రిప్ లో ఉంచుకుందని, భారీ రెమ్యునిరేషన్లతో తమవైపు తిప్పుకుందని, ఇలా రాజకీయంగా వారి ద్వారా తమకు అనుకూలమైన ప్రకటనలు ఇప్పించుకుంటోందనేది విజయ్ అభిమానుల వాదన. సదరు ప్రొడక్షన్ హౌస్ గతంలో విజయ్ తో కూడా సినిమాలు చేయాలనుకుంది కానీ, అది కుదర్లేదు. అందుకే రజినీని విజయ్ అభిమానులు ప్యాకేజీ స్టార్ అంటూ రచ్చ చేస్తున్నారు.
తమిళనాడులో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. జయలలిత లేకపోవడంతో అన్నాడీఎంకే చీలికలు పేలికలుగా మారింది. ఈ గ్యాప్ ని తమకి అనుకూలంగా మార్చుకోడానికి బీజేపీ సిద్ధమైంది. డీఎంకే అధినేత స్టాలిన్ మాత్రం మరోసారి తన సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతున్నారు. సరిగ్గా ఈ టైమ్ లో విజయ్ ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లో వెనకడుగు వేసినా, విజయ్ ధైర్యంగా మందుకొచ్చారు. పెద్ద తలకాయల్ని ఢీకొట్టాలని చూస్తున్నారు. ఈ దశలో రజినీ పొలిటికల్ డైలాగులు విజయ్ అభిమానుల్ని రెచ్చగొట్టాయి. మరి ఎన్నికలనాటికి ఈ గొడవ ఇంకెంత ముదురుతుందో చూడాలి.