Telangana government: తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టినట్టు కనిపిస్తోంది. ఒకేసారి కొన్ని వర్గాలు నిరసనలు, ఆందోళనలకు దిగడం.. సేవలను నిలిపివేస్తామని చెప్పడం ఇప్పుడు పలు అనుమానాలకు తెరలేపింది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగానలో కాలేజీలు తాము ఇక సేవలను కొనసాగించలేమని చెబుతూ ఇప్పటికే బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోతే కాలేజీలు మూసేస్తామని వార్నింగ్‌లు..
రాష్ట్రంలో ప్రతిఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా 2 వేల 350 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్‌లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు 35 వేలు మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పటికే మంజూరైన 12 వందల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నది కాలేజీల డిమాండ్.
ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామన్న ప్రైవేట్ హాస్పిటల్స్..
ఓ వైపు ఈ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే మరో సమస్య వచ్చింది. అదే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామంటూ ప్రకటన. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో.. తమ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య శ్రీ సేవల ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు 1400 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది.
మెట్రో సేవలను కొనసాగించలేమన్న ఎల్ అండ్ టీ..
ఇక మరో సమస్య.. హైదరాబాద్ మెట్రో. నగరం ఇటు చివర నుంచి అటు చివరకు సునాయసంగా ప్రయాణించేందుకు మెట్రో ఇప్పుడు ఎంతో అవసరం. కానీ మెట్రో సేవలను ఇక తాము కొనసాగించలేమంటోంది ఎల్ అండ్ టీ. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని.. ఇక తమ వల్ల కాదని చెబుతోంది ఎల్ అండ్ టీ. గత కొన్నాళ్లుగా వరుసగా నష్టాలు రావడం.. భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల.. మెట్రో రైళ్లను నడపడం కష్టంగా ఉందని.. కొన్ని రోజుల క్రితమే ఎల్ అండ్ టీ కేంద్రానికి లేఖ రాసింది.
ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదన్న ఎల్ అండ్ టీ
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నాయి. ఇటు టికెట్‌లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలడం లేదు. దీంతో మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు నిర్మాణ కంపెనీ వెల్లడించింది. విద్యుత్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చులన్ని కలిసి ఆర్థికంగా భారంగా మారిందని చెబుతోంది. మెట్రో తొలి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేందుకు రెడీగా ఉన్నామని తెలిపింది.
Also Read: గద్వాల జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసిన భార్య
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాత్మకంగా కుట్ర జరుగుతుందా?
అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకేసారి జరగడంపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నవాళ్లు ఇప్పుడెందుకు గొంతెత్తున్నారు? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాత్మకంగా కుట్ర జరుగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.