Chhattisgarh Journalist Murder| ఛత్తీస్ గడ్ కు చెందిన విలేకరి ముకేశ్ చంద్రకార్ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి సురేష్ చంద్రకార్‌ని పోలీసులు హైదరాబాద్ లో ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. మృతుడు ముకేశ్ చంద్రకార్ కు దూరపు బంధువు, వృత్తి రీత్యా ఒక కాంట్రాక్టర్ అయిన నిందితుడు సురేష్ చంద్రకార్ హత్య కేసులో మాస్టర్ మైండ్ అని పోలీసులు తెలిపారు. విలేకరి ముకేశ్ మృతదేహం లభించిన సమయం నుంచి నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సురేష్ చంద్రకార్ హత్య తరువాత హైదరాబాద్ లోని తన డ్రైవర్ ఇంట్లో దాక్కొని ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు 300 మొబైల్ నెంబర్లు, 200 సిసిటీవీల వీడియోలు పరిశీలించారు. ప్రస్తుతం హత్య కేసు విచారణ చేయడానికి పోలీసులు అతడిని ఛత్తీస్ గడ్ తీసుకెళ్లారు. అతడి భార్యను కూడా ఛత్తీస్ గడ్ లోని కంకెర్ జిల్లా నుంచి అరెస్ట్ చేయడం జరిగింది.
సురేష్ చంద్రకార్ కు చెందిన నాలుగు బ్యాంక్ అకౌంట్లు అధికారు సీజ్ చేశారు. అతడు అక్రమంగా నిర్మించిన ఒక భవనాన్ని ధ్వంసం చేశారు.
Also Read: ప్రతిపక్ష నాయకుడిని పట్టిస్తే రూ.85 లక్షల కానుక.. వెనెజూలాలో పాలిటిక్స్ పీక్స్
విలేకరి ముకేశ్ చంద్రకార్ హత్య కేసు వివరాలు
ముకేశ్ చంద్రకార్ మృతదేహం గత వారం క్రితం బస్తర్ జిల్లాలో సురేష్ చంద్రకార్ కు చెందని ఒక షెడ్డులో లభించింది. ముకేశ్ ని హత్య చేసిన తరువాత షెడ్డులోని ఒక సెప్టింక్ ట్యాంకు లో పడేసి దాన్ని సిమెంట్ తో హంతకులు పూర్చి పెట్టారు. ఛత్తీస్ గడ్ లో ఎన్డీటివి కోసం సమాచారం సేకరించే స్వతంత్ర విలేకరి అయిన ముకేశ్ చంద్రకార్ జనవరి 1, 2025న ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని బయలుదేరాడు. ఆ తరువాత ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతని సోదరుడు యుకేశ్ చంద్రకార్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన సోదరుడు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు.
32 ఏళ్ల ముకేశ్ చంద్రకార్ మృతదేహం పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం.. బలమైన రాడ్డుతో దాడి చేయడంతో అతని తలకు, ఛాతీ, వెన్నెముక, కడుపు భాగంల గాయాలున్నాయి. అతడి ముఖంపై చర్మం గుర్తపట్టలేనంత పాడైంది. అతని చేతిపై ఉన్న టాటూని చూసి కుటుంబ సభ్యులు గుర్తు పట్టారు. దాడి చేసిన ముగ్గురిలో ఇద్దరు ముకేశ్ బంధువులే. రితేశ్ చంద్రకార్, దినేశ్ చంద్రకార్, మహేంద్ర రామ్ టెకె.. ఈ ముగ్గురూ కలిసి ముకేశ్ ని హత్య చేశారు.
ఈ ముగ్గురు కూడా కాంట్రాక్టర్ సురేష్ చంద్రకార్ కోసం పనిచేస్తున్నారు. వీరిలో రితేశ్ చంద్రాకర్ పారిపోతుండగా.. రాయ్ పూర్ ఎయిర్ పోర్టు లో పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ నుంచి దినేశ్ ని పట్టుకున్నారు.
జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకార్ మృతి పట్ల ఛత్తీస్ గడ్ ఉపముఖ్య మంత్రి విజయ్ శర్మ, ప్రెస్ అసోసియేష్ అండ్ ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సంతాపం తెలియజేశారు.